Pan-IIT Summit: విజయవాడలో పాన్‌ ఐఐటీ ఏపీ సమ్మిట్‌ 2026 ప్రారంభమైంది. శనివారం మంత్రి నారా లోకేశ్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఐఐటీ డైరెక్టర్లు, ఐటీ నిపుణులు, విధాన నిర్ణేతలతో కీలక చర్చలు జరుగుతున్నాయి. ఇంధనం, స్వచ్ఛాంధ్ర, డీప్‌టెక్‌, స్పేస్‌, ఏరోస్పేస్‌ రంగాలపై ప్యానెల్‌ చర్చలు నిర్వహిస్తున్నారు.

ఛైర్ ఆఫ్ ది సమ్మిట్ స్వదీప్ పిల్లారిశెట్టి మాట్లాడుతూ, 20 సంవత్సరాల్లో విజయవాడలో ఇదే అతిపెద్ద ఈవెంట్‌ అని తెలిపారు. దేశం నలుమూలల నుంచి ఐఐటీ డైరెక్టర్‌లు పాల్గొంటున్నారని, ఇది కాన్ఫరెన్స్ కాదు.. కన్వర్జెన్స్ అని అన్నారు. ఇన్నోవేషన్, ఇన్వెస్ట్‌మెంట్, టెక్నాలజీ రంగాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.

ఈ సమ్మిట్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొత్త ఆవిష్కరణలు, స్టార్టప్‌లను స్వయంగా పరిశీలించారు. ఆక్సి ఏరోస్పేస్‌ రూపొందించిన డ్రోన్‌ను చూసి, సంస్థ ప్రతినిధుల కోరిక మేరకు దానిపై సంతకం చేశారు. పెట్రోల్‌తో నడిచే ద్విచక్ర వాహనాలను గంటల్లోనే ఈవీలుగా మార్చే సాంకేతికతపై వివరాలు తెలుసుకుని, ఈ ప్రాజెక్టును రాష్ట్రంలో ఏర్పాటు చేసేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ముఖాన్ని స్కాన్‌ చేసి నిమిషాల్లో ప్రాథమిక ఆరోగ్య నివేదిక అందించే యాప్‌పైనా ఆసక్తి చూపారు.

స్వర్ణాంధ్ర-10 సూత్రాల అమలులో టెక్నాలజీ వినియోగంపై చిన్నారులు ఇచ్చిన ప్రజెంటేషన్‌ను ఆసక్తిగా విన్న సీఎం.. వారిని అభినందించి గ్రూప్‌ ఫొటో దిగారు.

ఐటీ సెక్రటరీ కాటంనేని భాస్కర్ మాట్లాడుతూ, ప్రభుత్వం తక్కువ కనిపించాలి.. పాలన అందించాలనే నినాదంతో ముందుకు వెళ్తున్నామని అన్నారు. సెమికండక్టర్, లిఫ్ట్ పాలసీలు తదితర ప్రోయాక్టివ్ పాలసీలు తీసుకువచ్చామని, ఏపీని ఒక డెస్టినేషన్‌లా భావించి అవకాశాలు అందుకోవాలని సూచించారు.

Next Story