Parishad Elections: ఏపీలో పరిషత్ ఎన్నికల పోలింగ్ ప్రారంభం.. ఓటు హక్కు వినియోగించుకోనున్న 2.61 కోట్ల మంది ఓటర్లు
2.61 కోట్ల మంది ఓటర్లు

Parishad Elections: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మండల పరిషత్ టెరిటోరియల్ కాన్‌స్టిట్యూన్సీ (ఎంపీటీసీ), జిల్లా పరిషత్ టెరిటోరియల్ కాన్‌స్టిట్యూన్సీ (జడ్పీటీసీ) ఎన్నికల పోలింగ్ గురువారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది.
రాష్ట్రంలోని 582 జడ్పీటీసీ, 7,767 ఎంపీటీసీ స్థానాలకు మొత్తం 21,012 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. వీటిలో ఎంపీటీసీ స్థానాలకు 18,843 మంది, జడ్పీటీసీ స్థానాలకు 2,169 మంది పోటీ పడుతున్నారు. 31,460 పోలింగ్ కేంద్రాల్లో 2.61 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. నామినేషన్ల ఉపసంహరణ నాటికి రాష్ట్రవ్యాప్తంగా 2,128 ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవంగా నిర్ణయమయ్యాయి.
పరిషత్ ఎన్నికల పోలింగ్ కోసం రాష్ట్రవ్యాప్తంగా 2,01,116 మంది అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది సేవలు అందిస్తున్నారు. వీరిలో రిటర్నింగ్ అధికారులు, ప్రిసైడింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు, జోనల్ అధికారులు, సూక్ష్మ పరిశీలకులు ఉన్నారు.
భారీ వర్షాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాల్లోని ఐదు మండలాల్లో పూర్తిగా, మరో మండలంలోని రెండు పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం వాయిదా వేసింది. ఏలూరు జిల్లాలో వేలేరుపాడు, బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, పోలవరం మండలాల్లోను, తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలంలోను పూర్తిగా పోలింగ్ వాయిదా పడింది. ఈ ప్రాంతాల్లో శుక్రవారం పోలింగ్ నిర్వహించి శనివారం ఓట్లు లెక్కిస్తారు.
గతంలో నామినేషన్లు, మున్సిపల్ పోలింగ్ సందర్భంగా చోటుచేసుకున్న ఘటనలను దృష్టిలో పెట్టుకుని పరిషత్ పోలింగ్‌కు గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పల్నాడు, నంద్యాల, అన్నమయ్య, వైఎస్సార్ కడప, తిరుపతి జిల్లాల్లో ఏపీఎస్పీకి చెందిన 111 ప్లటూన్ల అదనపు బలగాలను మోహరించారు.

