Pawan Kalyan: జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోమవారం ముంబయి చేరుకున్నారు. గత కొంత కాలంగా భుజాల సమస్యలతో తీవ్ర ఇబ్బంది పడుతున్న ఆయన, ఉన్నత స్థాయి వైద్య పరీక్షలు చేయించుకోవడానికి ముంబయిలోని ప్రతిష్టాత్మక కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ హాస్పిటల్‌కు వెళ్లనున్నారు.

పవన్ కళ్యాణ్ భుజాల్లో రొటేటర్ కఫ్ గాయం, రెండు భుజాల కండరాలు పూర్తిగా చిట్లడం వంటి సమస్యలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ సమస్యల కారణంగా ఆయన రోజువారీ కార్యకలాపాలు, రాజకీయ బాధ్యతలు నిర్వహించడంలో కొంత ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని, దేశంలోని అత్యుత్తమ వైద్య సదుపాయాలున్న ముంబయి ఆసుపత్రికి వెళ్లి పూర్తి స్థాయి పరీక్షలు చేయించుకోవాలని నిర్ణయించారు.

ఈ ప్రయాణంలో పవన్ కళ్యాణ్‌తో పాటు ఆయన భార్య అన్నా కొణిదెల కూడా ఉన్నారు. ఆయన ఆరోగ్యం త్వరగా కుదురుకొని, పూర్తి స్థాయిలో కార్యక్షేత్రంలోకి వచ్చి రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనాలని అభిమానులు, జనసేన నాయకులు, మంత్రులు ఆశా భావాలు వ్యక్తం చేస్తున్నారు.

పవన్ కళ్యాణ్ ఆరోగ్య సమస్యలు గత కొంతకాలంగా చర్చనీయాంశమవుతున్న విషయం తెలిసిందే. ఇటీవలి కాలంలో ఆయన పలు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొన్నప్పటికీ, శారీరక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సమాచారం. ఈ పరీక్షల ఫలితాల ఆధారంగా తదుపరి చికిత్స ప్రణాళికలు రూపొందించనున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story