Pawan Kalyan: హస్తకళాకారులకు అవసరమైన నాణ్యమైన కలపను తక్కువ ధరకే అందించేలా చర్యలు తీసుకోవాలని ఉపముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి పవన్‌ కల్యాణ్‌ అధికారులకు సూచించారు. లాభాపేక్ష లేకుండా కలప సేకరణ, రవాణా, నిర్వహణ ఖర్చులు మాత్రమే వసూలు చేసేలా ధర నిర్ణయించాలని ఆయన స్పష్టం చేశారు. ముడి సరకు దొరక్క ఇబ్బంది పడుతున్న హస్తకళాకారులకు వుడ్‌ బ్యాంకులు వరంగా మారాలని, సాధ్యమైనంత త్వరగా అందుబాటులోకి తేవాలని నిర్దేశించారు.

రాష్ట్రంలో ఆరు క్లస్టర్ల పరిధిలో క్రాఫ్ట్‌ వుడ్‌ బ్యాంకుల ఏర్పాటుపై సోమవారం పవన్‌ కల్యాణ్‌ అటవీ అధికారులతో సమీక్షించారు. అటవీ వనరుల సుస్థిర వినియోగం, శాస్త్రీయ నిర్వహణ, అక్రమ కలప సేకరణ నివారణ, కళాకారులకు ఉపయోగపడే ముఖ్యమైన కలప జాతుల పునరుత్పత్తి, తోటల అభివృద్ధి, సంప్రదాయ, వారసత్వ కళాకారులకు నిరంతర కలప సరఫరా వంటి లక్ష్యాల సాధనకు వుడ్‌ బ్యాంకులు ఉపయోగపడేలా చూడాలని ఆయన ఆదేశించారు. దళారుల ప్రమేయం లేకుండా ప్రభుత్వమే చెక్కను అందిస్తే ఉత్పత్తి ఖర్చు తగ్గి కళాకారులకు ఆర్థిక భరోసా లభిస్తుందని, భావి తరాలు సంప్రదాయ కళల వైపు ఆకర్షితులవుతాయని పేర్కొన్నారు.

క్లస్టర్ల వారీగా కళాకారుల కలప అవసరాలు అంచనా వేయాలని, కలప లభ్యతను శాస్త్రీయంగా మ్యాపింగ్‌ చేయాలని సూచించారు. తక్కువగా దొరికే అంకుడు, తెల్లపొణికి చెట్లను అటవీశాఖ నర్సరీల్లో పెంచాలని, క్రాఫ్ట్‌ వుడ్‌ బ్యాంకుల డిజైన్‌, నిర్వహణలో ఒకే నమూనా పాటించాలని పీసీసీఎఫ్‌ పీవీ చలపతిరావుకు సూచించారు.

వుడ్‌ బ్యాంకులు ఏర్పాటు చోటులు:

కొండపల్లి బొమ్మల తయారీకి తెల్లపొణికి కలప అవసరం. ఎన్టీఆర్‌ జిల్లా కొండపల్లిలో ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్స్‌ క్వార్టర్స్‌ను వుడ్‌ బ్యాంకుగా మార్చి తెల్లపొణికి కలప సేకరణ ప్రారంభించారు.

ఏటికొప్పాక లక్క బొమ్మల కళాకారుల కోసం ప్రైవేట్‌ వాణిజ్య భవనాన్ని అద్దెకు తీసుకుని కార్యకలాపాలు ప్రారంభిస్తున్నారు. అక్కడ 1.5 ఘనపు మీటర్ల అంకుడు కర్రను సిద్ధం చేశారు.

అన్నమయ్య జిల్లా శెట్టిగుంటలో లేపాక్షి హ్యాండ్‌ క్రాఫ్ట్‌ సొసైటీ కామన్‌ ఫెసిలిటీ సెంటర్‌ను క్రాఫ్ట్‌ వుడ్‌ బ్యాంకుగా గుర్తించారు. ఇప్పటికే 50 ఘనపు మీటర్ల టేకు, 150 ఘనపు మీటర్ల నాన్‌-టేకు కలప సిద్ధం.

తిరుపతి జిల్లా మాధవమాల చెక్క బొమ్మల కళాకారుల కోసం పాత ఎర్రచందనం డిపోను వుడ్‌ బ్యాంకుగా మారుస్తున్నారు. సంప్రదాయ చెక్కతో పాటు ఎర్రచందనం కూడా అందుబాటులో ఉంచుతున్నారు. 14.158 ఘనపు మీటర్ల నారియేపి, 8.495 ఘనపు మీటర్ల తుమ్మ కలప సేకరించారు.

ఉదయగిరి కళాకారుల కోసం ప్రస్తుత ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ క్వార్టర్స్‌ను వుడ్‌ బ్యాంకుగా మార్చారు.

బొబ్బిలి వీణ తయారీ కోసం గొల్లపల్లి క్రాఫ్ట్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ను వుడ్‌ బ్యాంకుగా గుర్తించారు. 15.66 ఘనపు మీటర్ల పనస, రోజ్‌వుడ్‌ కలప సిద్ధం.

రాజమహేంద్రవరం సెంట్రల్‌ వుడ్‌ బ్యాంకులో వెదురు బొంగులు, రోజ్‌వుడ్‌, టేకు అందుబాటులో ఉన్నాయి.

ఎడ్ల బండ్ల తయారీకి పేరొందిన ఏలూరు జిల్లా కాపవరంలో టేకుతో పాటు ఇతర కలపకు వుడ్‌ బ్యాంకు ఏర్పాటు చేయబోతున్నారు.

ఈ చర్యలతో హస్తకళాకారులకు నాణ్యమైన కలప సులభంగా, సరసమైన ధరకు లభించి సంప్రదాయ కళలు మరింత బలపడతాయని ఆశాభావం వ్యక్తమవుతోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story