తిరుమల లడ్డు కల్తీపై పవన్ కళ్యాణ్ ఘాటు వ్యాఖ్యలు

భగవంతుడి సొమ్ము దోచినవారి తరాలు నాశనమవుతాయి - ఉప ముఖ్యమంత్రి హెచ్చరిక

Deputy Chief Minister Pawan Kalyan: తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడిన విషయం అన్ని నివేదికల్లో స్పష్టంగా తేలినా, గత ప్రభుత్వ ముఖ్యమంత్రి బాధ్యులను ఎందుకు కాపాడుతున్నారో అర్థం కావడం లేదని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. దేవుడి సొమ్ముతో ఆడుకున్నవారి తరాలు కూడా లేచిపోతాయని, జాగ్రత్తగా ఉండాలని ఆయన హెచ్చరించారు.

మంగళవారం శాసనసభలో కల్తీ నెయ్యి విషయంపై జరిగిన లఘు చర్చలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే)లో 68 లక్షల కేజీల కల్తీ నెయ్యి వాడినట్లు నివేదికలు వచ్చాయని తెలిపారు. ఎన్‌డీడీబీ నివేదికలో పందికొవ్వు కలిసినట్లు, సీబీఐ సిట్ నివేదికలో రసాయనాలు, పామాయిల్‌తో నెయ్యి లేకుండా తయారు చేసినట్లు స్పష్టమైందని చెప్పారు.

"ఆ ముఖ్యనేత 'నాకు సంబంధం లేదు, తితిదే బోర్డు చేసింది. కమిటీ వేసి విచారణ జరిపండి' అని సులభంగా తప్పించుకోవచ్చు. కానీ సిట్ నివేదిక వచ్చినా కల్తీ లేదంటున్నారు" అంటూ ఆయన మండిపడ్డారు. నాటి తితిదే పాలక మండలితో పాటు గత ప్రభుత్వాన్ని నడిపిన వ్యక్తి కూడా బాధ్యత తీసుకోవాలని స్పష్టం చేశారు. దోషులెవరైనా శిక్ష పడాల్సిందేనని ఘాటుగా అన్నారు.

ఇప్పటికైనా కల్తీని ఒప్పుకోవాలని, లేకపోతే దిల్లీలో కోర్టుల్లో కేసులు వేస్తున్నంత మేరకు పాపం పెరిగి నాశనం త్వరగా వస్తుందని, తగ్గదని హెచ్చరించారు. నెయ్యి సరఫరాదారులైన భోలేబాబా, మాల్‌గంగా, వైష్ణవీ డెయిరీలు పాలు లేకుండా పామాయిల్, రసాయనాలతో నెయ్యి తయారు చేసినట్లు సిట్ నివేదికలో ఉందని, ఇది ప్రణాళికాబద్ధ కుట్ర అని పేర్కొన్నారు. నిబంధనలను సడలించి టెండర్లు ఇచ్చారని విమర్శించారు.

2019-24 మధ్య 11 కోట్ల మంది భక్తులు దర్శనం చేసుకుని 48 కోట్ల లడ్డూలు పొందగా, వాటిలో 20 కోట్ల లడ్డూలు నకిలీ నెయ్యితో తయారయ్యాయని తితిదే రికార్డులు చూపిస్తున్నాయని తెలిపారు. గతంలో భక్తులు ప్రసాద నాణ్యతపై తనకు చెప్పిన విషయాలు గుర్తొచ్చి పశ్చాత్తాపంతో దీక్ష చేశానని, ఎన్డీఏ సమావేశంలో చంద్రబాబు ఎన్‌డీడీబీ నివేదిక చదివినప్పుడు జరిగిన చర్చలు గుర్తుచేశారు.

శ్రీకృష్ణదేవరాయలు ఆముక్తమాల్యదలో రాసిన పద్యాన్ని సభలో చదివి వినిపించారు. దేవాలయ అధికారులు మమకారం లేని ఒంటరి వ్యక్తులై ఉండాలని, దేవుడి సొమ్ము రాజు ఖజానాకు చేర్చడం తప్పని ఆయన హెచ్చరించిన విషయాన్ని గుర్తుచేశారు.

పవన్ కళ్యాణ్ ప్రసంగం సభలో ఉన్న పాఠశాల విద్యార్థులను కూడా ఆకట్టుకుంది. ఈ వివాదంపై గత ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story