Pawan Kalyan: పవన్ కల్యాణ్: గిరిజనులకు అడవితల్లి బాట.. స్థానిక ఎన్నికల్లో పొత్తు ప్రకారం జనసైనికులు పోటీ
జనసైనికులు పోటీ

Pawan Kalyan: ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆదివారం పోలవరం జిల్లా రంపచోడవరం మండలం కాకవాడలో నిర్వహించిన అడవితల్లి బాట 2.0 బహిరంగ సభలో పాల్గొని, గిరిజనుల అభివృద్ధికి రూ.2,052 కోట్లతో 1,341 ఆవాసాలకు రోడ్లు, వంతెనల నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. అంతకుముందు రాకోడులో పర్యటించి కాకవాడ నుంచి వేములకొండ వరకు రూ.2.29 కోట్ల రహదారి పనులకు శంకుస్థాపన చేశారు.
‘ఎన్నికలకు ముందు మేం చెప్పిన మాట నమ్మి ఓట్లు వేసి గెలిపించారు. ఆ ఫలితమే నేడు అమలు చేస్తున్న అడవితల్లి బాట. ఇది గిరిజనుల బంగారు భవిష్యత్తుకు బాసటగా నిలుస్తుంది. డోలీ మోతలు, రోడ్డులేని గిరిజన గ్రామం ఉండకూడదు. అభివృద్ధికి దూరమై ఏ కుటుంబమూ ఇబ్బంది పడకూడదు’ అని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. అల్లూరి సీతారామరాజు పోరాటం తనకు స్ఫూర్తి అని చెప్పుకుంటూ, ‘మీలో ఒకడినయ్యా’ అని అనగానే సభలో కరతాళధ్వనులు మార్మోగాయి.
గిరిజన ప్రాంతాలున్న ఏడు జిల్లాల్లో అడవితల్లి బాట మొదటి దశలో 858 గ్రామాలను కలుపుతూ 1,666 కి.మీ. మేర రూ.1,406 కోట్లతో రహదారి పనులు చేపట్టామని, 753 గ్రామాల పరిధిలో 1,281 కి.మీ. నిర్మాణం పూర్తయిందని, వచ్చే మార్చికి మిగతావీ పూర్తవుతాయని తెలిపారు. ఎన్నికల్లో కూటమికి అండగా నిలబడినందుకు రూ.30 వేల కోట్లతో అమరజీవి జలధార పనులు చేపడుతున్నామని చెప్పారు. పట్టణాల్లో రోడ్డు నిర్మాణ ఖర్చు కంటే గిరిజన ప్రాంతాల్లో రెట్టింపు అవుతుందని, ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు సహకారంతో ఖర్చుకు వెనుకాడకుండా రహదారులు నిర్మిస్తున్నామని అన్నారు.
స్థానిక సమస్యలపై స్పందిస్తూ ‘మీకు సెల్‌టవర్లు, రోడ్లు, పాఠశాలలు ఏదైనా చేస్తాం. మా చేతుల్లో మంత్రదండం లేదు, కొంచెం సమయమివ్వాలి. మాకు అధికారంపై వ్యామోహం లేదు, బాధ్యత మాత్రమే ఉంది’ అని స్పష్టం చేశారు. వైకాపా హయాంలో 2019 నుంచి 2024 వరకు ఒక్క రోడ్డూ వేయలేదని, శిలాఫలకాలు, రంగులకు రూ.వందల కోట్లు ఖర్చు చేశారని విమర్శించారు.
అదే సభలో స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా మాట్లాడిన పవన్ కల్యాణ్, కూటమి పార్టీల నుంచి పోటీ చేసే అభ్యర్థులను గెలిపించి సత్తా చాటాలని పిలుపునిచ్చారు. ‘స్థానిక ఎన్నికల్లో జనసైనికులు పొత్తు ప్రకారం పోటీ చేస్తారు. తెదేపా, భాజపా నాయకులకు ఎంత గౌరవం ఇస్తారో, తమ వాళ్లకూ అంతే మద్దతివ్వాలి’ అని కోరారు. పార్టీ పెట్టినప్పుడు యువత ఎర్ర తువ్వాళ్లు వేసుకుని వచ్చిందని, 2014లో ఒక్క పదవీ ఆశించకుండా కూటమికి పనిచేశారని గుర్తు చేశారు. గత ప్రభుత్వం చంద్రబాబును జైల్లో పెట్టిన సమయంలో జనసైనికులు, వీరమహిళలు రాష్ట్రానికి భరోసా, ధైర్యం ఇచ్చారని అన్నారు. మూడు పార్టీలూ బాగుండాలని, జనసేన చాలా త్యాగం చేసిందని, జనసైనికులు, వీరమహిళలు తగిన ప్రాతినిధ్యం పొందేందుకు అండగా నిలవాలని కోరారు.
రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్‌శ్రీనివాస్, ఎమ్మెల్యేలు పంతం నానాజీ, నిమ్మక జయకృష్ణ, బొలిశెట్టి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు కూడా అడవితల్లి బాట 2.0ను అభినందిస్తూ, గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించి డోలీ మోతలకు చరమగీతం పాడేలా ముందుకు తీసుకెళుతున్నారని ఎక్స్‌లో పేర్కొన్నారు.

