Pawan Kalyan: గోదావరి కాలుష్యం, పన్ను ఎగవేతపై పవన్ కల్యాణ్ ఆగ్రహం.. ఆంధ్రా పేపర్ మిల్స్‌పై కఠిన చర్యలు
ఆంధ్రా పేపర్ మిల్స్‌పై కఠిన చర్యలు

Pawan Kalyan: ఆంధ్రా పేపర్ మిల్స్ (ఆంధ్రా పేపర్ లిమిటెడ్) యాజమాన్యం వైఖరిపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరం వద్ద గోదావరి నది కాలుష్యానికి సగం భాగం ఆంధ్రా పేపర్ మిల్స్‌దేనని ఆక్షేపించారు. నదిలోకి కాలుష్యాన్ని విడిచిపెడుతూ పన్నులు మాత్రం ఎగ్గొడుతున్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు.
పవన్‌కల్యాణ్ ఎక్స్ (X)లో పోస్టు చేస్తూ ‘‘ఆంధ్రా పేపర్ మిల్స్.. పన్నులు చెల్లించి పుష్కరకాలం దాటింది. పన్నులు చెల్లించమంటే కోర్టులకెళ్లి కాలయాపన చేస్తున్నారు. పన్నులు చెల్లించేందుకు ఇంతటి బాధ్యతారాహిత్యం ఎందుకు? తప్పు సరిదిద్దుకునే అవకాశం ఇచ్చినా స్పందించడం లేదు. నోటీసు పంపి 3 నెలల సమయం ఇచ్చినా కనీస స్పందన లేదు. ఆంధ్రా పేపర్ మిల్స్‌పై ఇక ఉపేక్షించం.. కఠిన చర్యలు తీసుకుంటాం’’ అని స్పష్టం చేశారు.
2016 తర్వాత ఒక్క రూపాయి పన్ను కూడా చెల్లించలేదని, మొత్తం రూ.21.34 కోట్ల పన్ను బకాయిలు ఉన్నాయని ఆయన తెలిపారు. గోదావరి కాలుష్యానికి ఆంధ్రా పేపర్ యాజమాన్యమే ప్రధాన కారణమని పేర్కొన్నారు. కాలుష్య నియంత్రణ మండలిని తక్షణం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

