Pawan Kalyan: పవన్ కల్యాణ్: ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. 7.1 లక్షల ఉద్యోగాల క
7.1 లక్షల ఉద్యోగాల కల్పన!

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్‌ను పెట్టుబడిదారులకు స్వర్గధామంగా మారుస్తున్నామని ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ స్పష్టం చేశారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో పారిశ్రామికవేత్తలు భయపడే పరిస్థితి ఉండేదని, ‘పరిశ్రమ పెడితే మాకేం ఇస్తారు’ అని వేధించే విష సంస్కృతి ఉండేదని ఆయన విమర్శించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ‘మీరు రాష్ట్రానికి, ప్రజలకు ఏం చేస్తారు’ అని అడిగే సత్సంప్రదాయాన్ని తీసుకొచ్చామని తెలిపారు.
సోమవారం కాకినాడ జేఎన్‌టీయూ ప్రాంగణంలో జరిగిన సీఐఐ ప్రాంతీయ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో 2024 జూన్ నుంచి రాష్ట్రానికి 714 పరిశ్రమల రూపంలో రూ.22.6 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని వెల్లడించారు. వీటిలో రూ.16.6 లక్షల కోట్ల ప్రాజెక్టులకు ప్రభుత్వ అనుమతులు పూర్తయ్యాయి. రూ.4.7 లక్షల కోట్ల ప్రాజెక్టులు అమలు దశకు చేరుకున్నాయి. దీని వల్ల యువతకు 7.1 లక్షల ఉద్యోగావకాశాలు లభిస్తాయని పవన్‌కల్యాణ్ చెప్పారు.
సదస్సు వేదికగా 16 పరిశ్రమలతో రూ.4,652 కోట్ల విలువైన అవగాహన ఒప్పందాలు (ఎంఓయూలు) కుదిరాయి. మరో నాలుగు ప్రాజెక్టులకు రూ.2,090 కోట్లతో శంకుస్థాపనలు జరిగాయి. మొత్తం రూ.6,347 కోట్ల పెట్టుబడుల ద్వారా కాకినాడ, పరిసర ప్రాంతాల్లో సుమారు 18 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని అధికారులు ప్రకటించారు.
ఒకప్పుడు పేద దేశంగా ఉన్న సింగపూర్ సంకల్పం, సమష్టి కృషితో అద్భుతంగా మారిందని పవన్‌కల్యాణ్ గుర్తు చేశారు. రాష్ట్రానికి ఉన్న 1,053 కిలోమీటర్ల తీర ప్రాంతం గొప్ప వరమని, సముద్ర పరిశ్రమలు, షిప్‌బిల్డింగ్, గ్రీన్ హైడ్రోజన్, కెమికల్స్, ఫుడ్ ప్రాసెసింగ్, ఆక్వాకల్చర్ రంగాల్లో అపార అవకాశాలున్నాయని పేర్కొన్నారు. అయితే పారిశ్రామిక అభివృద్ధితోపాటు పర్యావరణ పరిరక్షణ కూడా అంతే ముఖ్యమని, గ్రేట్ గ్రీన్‌వాల్ నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు.
పల్లెలు, ఏజెన్సీ ప్రాంతాల్లోనూ పరిశ్రమలు రావాలని పవన్‌కల్యాణ్ కోరారు. రూ.1.70 లక్షల కోట్లతో రోడ్లు, కాలువలు, అనుసంధాన మార్గాలు నిర్మిస్తున్నామని, పల్లె పండుగ, అడవితల్లి బాట వంటి పథకాల ద్వారా గ్రామీణ మౌలిక సదుపాయాలు మెరుగుపరుస్తున్నామని తెలిపారు. పెట్టుబడిదారులు కేవలం లాభాలకే పరిమితం కాకుండా దేశాభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం ఆలోచించాలని, జంషెడ్జీ టాటా ఉదాహరణను అనుసరించాలని సూచించారు.
సదస్సు అనంతరం మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ గుజరాత్ తరహాలో స్థిరమైన ప్రభుత్వం కొనసాగితే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. నవంబరు 12, 13 తేదీల్లో విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సు జరగనుందని తెలిపారు. మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి ఏపీని ఐదు జోన్లుగా విభజించి పారిశ్రామిక అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.

