Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ హస్తకళలను ప్రపంచ నలుమూలలకు చేర్చి, రాష్ట్రంలోని కళాకారుల జీవన ప్రమాణాలను మెరుగుపరచాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. మార్కెటింగ్‌ను మరింత పెంచి అనుకున్న లక్ష్యాలను సాధించాలని సూచించారు.

విజయవాడలోని అంబేడ్కర్ కళా వేదికలో నిర్వహించిన ఏపీ హస్తకళా మహోత్సవానికి పవన్ కల్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా హస్తకళాకారుల సమస్యలను సమీక్షించి, వారి ఆరోగ్య సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. తొలుత అందరికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, కళాకారుల పిల్లల చదువుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు.

“వంశపారంపర్యంగా వచ్చిన ఈ కళను ముందుకు తీసుకెళ్లడం కూడా చాలా ముఖ్యం. హస్తకళలు, చేనేత భారతదేశ సంస్కృతి, సంప్రదాయాల మూలాలు. ఒక జాతి గొప్పతనం భవనాల్లో కాదు, కళాకారుల్లోనే కనిపిస్తుంది” అని పవన్ కల్యాణ్ అన్నారు. కళాకారుల ప్రతిభ, కష్టాన్ని గుర్తించడానికే ఈ కార్యక్రమానికి వచ్చానని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ సంప్రదాయ హస్తకళా వారసత్వానికి పుట్టినిల్లని పేర్కొన్న పవన్ కల్యాణ్, రాష్ట్రంలో రెండు లక్షల మందికి పైగా కళాకారులు ఉన్నారని చెప్పారు. వారి ఉత్పత్తులను గ్లోబల్ మార్కెట్‌తో అనుసంధానం చేసి, హస్తకళా రంగానికి కొత్త దశ తీసుకురావాలని లక్ష్యంగా ప్రకటించారు. వదిలేసిన వస్త్రాలను కూడా వ్యర్థం కాకుండా ఉపయోగించి ఉత్పత్తులు తయారు చేయడం ద్వారా డబ్బు సంపాదనతోపాటు పర్యావరణ పరిరక్షణ కూడా సాధ్యమవుతుందని వివరించారు.

మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా హస్తకళా రంగం అభివృద్ధి చెందాలని, మారుమూల గ్రామాల్లోని కళాకారుల కృషి ప్రపంచానికి చేరాలని ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. “వోకల్ ఫర్ లోకల్ మాత్రమే కాదు.. లోకల్ టు గ్లోబల్ లక్ష్యంగా పని చేద్దాం” అని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.

Next Story