Pawan Kalyan: 140 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సాకారం చేస్తున్నారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని మోదీ జాతికి అంకితం చేసిన సందర్భంగా ఏర్పాటైన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.

తెలుగు జాతి ఎవరికీ తలవంచదని అల్లూరి సీతారామరాజు గర్జించారని గుర్తు చేసిన పవన్‌, ఉత్తరాంధ్ర అభివృద్ధిలో భోగాపురం విమానాశ్రయం కొత్త అధ్యాయం అని అన్నారు. చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వంలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామి రాష్ట్రంగా ఎదుగుతోందని చెప్పారు. దేశ ప్రగతికి మౌలిక వసతులు కీలకమని ప్రధానికి తెలుసు కాబట్టే రైల్వే జోన్‌ ఇచ్చి ఇక్కడి ప్రజల కోరికలు తీర్చారని పేర్కొన్నారు. వికసిత్‌ భారత్‌ దిశగా దేశాన్ని నడిపిస్తున్నారని అన్నారు.

కష్టపడి పనిచేస్తున్న ప్రధానికి చాలా అవమానాలు ఎదురయ్యాయని, దేశాన్ని అభివృద్ధి మార్గంలో తీసుకెళ్లడం ఎంత కష్టమో ఆలోచించాలని పవన్‌ అన్నారు. ఢిల్లీ జంతర్‌మంతర్‌లో ప్రధానిని విమర్శిస్తుంటే తాను చాలా బాధపడ్డానని వెల్లడించారు. ఎన్ని బాధలు పడినా, వెనక్కి లాగుతున్నా మోదీ ఎక్కడా భయపడలేదని అన్నారు. కాయలు కాసే చెట్టుకే రాళ్లు పడడం సహజమని, తనను దూషించే వారిని కూడా క్షమించే గుణం మోదీదని ప్రశంసించారు. సెలవు తీసుకోకుండా పనిచేస్తున్న ప్రధానికి మనం ఏమివ్వగలం? ఇలాంటి ప్రధాని రావడం దేశానికి మన అదృష్టమని అన్నారు.

ఈ కార్యక్రమంలో గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు పాల్గొన్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story