Pawan Kalyan: అర్నబ్‌ తుపాను (Cyclone Arnab) ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు అండగా నిలవాలని, సహాయక చర్యల్లో చురుకుగా పాల్గొనాలని జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ జనసైనికులకు పిలుపునిచ్చారు.


కోస్తా జిల్లాలపై తుపాను తీవ్ర ప్రభావం చూపించిందని, చాలా చోట్ల ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని పవన్‌ తెలిపారు. తుపాను తీరం దాటినా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసిందని ఆయన పేర్కొన్నారు. లోతట్టు ప్రాంతాలు, తీర ప్రాంతాల్లో నివసించే ప్రజలకు అవసరమైన సాయం అందించాలని, వారికి అండగా నిలవాలని జనసేన శ్రేణులను కోరారు.


తుపాను బాధితులను సహాయక శిబిరాలకు తరలించి ఆహారం, అవసరమైన సహాయం అందించాలని పవన్‌ సూచించారు. రహదారులపై కూలిన చెట్లు, విద్యుత్‌ స్తంభాల తొలగింపులో అధికారులు, సహాయక సిబ్బందికి సహకరించాలని, బాధితులకు వీలైనంత త్వరగా సాయం అందేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.


ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వ యంత్రాంగం చేపడుతున్న సహాయక చర్యల్లో జనసేన కార్యకర్తలు భాగస్వాములు కావాలని, విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు భరోసా కల్పించాలని పవన్‌ కల్యాణ్‌ దిశానిర్దేశం చేశారు.

Next Story