పిఠాపురంలో గొడవలు పెడితే ఏరివేస్తా!

Pawan Kalyan Warning: పిఠాపురం నియోజకవర్గంలో చిన్న చిన్న సంఘటనలను కూడా భారీగా ప్రచారం చేస్తూ వైరల్‌ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ‘‘కొబ్బరి ఆకు లేదా తాటి ఆకు పడినా ఏదో పెద్ద సంఘటన జరిగినట్టు ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి అవాస్తవ ప్రచారాలు మానుకోవాలి’’ అని ఆయన సూచించారు.

పిఠాపురంలో జరుగుతున్న ‘పీఠికాపుర సంక్రాంతి మహోత్సవాలు’ కార్యక్రమంలో పవన్‌కల్యాణ్‌ ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రులు నారాయణస్వామి, నాదెండ్ల మనోహర్‌, కందుల దుర్గేష్‌లతో కలిసి వివిధ స్టాళ్లను ఆయన సందర్శించారు.

పవన్‌ మాట్లాడుతూ.. ‘‘పిఠాపురం సంక్రాంతి ఉత్సవాలు దేశవ్యాప్తంగా చిరునామా పొందాలి. అన్ని మతాల వారు ఈ పండుగను జరుపుకునే స్థాయికి ఎదగాలి. తెలంగాణ సోదరీమణులను సంక్రాంతికి ఆహ్వానించి, గోదావరి జిల్లాల ఆతిథ్యాన్ని చూపించాలి. సంక్రాంతి అంటే కేవలం కోడిపందేలు, జూదాలు మాత్రమే కాదు. వాటిని చేసేవారు చేసుకోవచ్చు.. కానీ ఉత్సవాలు వాటికే పరిమితం కాకూడదు.

పిఠాపురం దేశానికి కీలకమైన శక్తిపీఠం. శ్రీపాద శ్రీవల్లభుడు అవతరించిన పుణ్యభూమి ఇది. ఇక్కడి నుంచి నేను ఎన్నికై రావడం భగవంతుడి సంకల్పం. నియోజకవర్గ అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపడుతున్నాం. నన్ను బలపరిచితే మరింత శక్తివంతంగా పనిచేస్తాను. అధికారంలో ఉన్నా లేకపోయినా.. ఆఖరి శ్వాస వరకు పిఠాపురం ప్రజల కోసం కృషి చేస్తాను.

పులివెందులలో సొంత బాబాయ్‌ను చంపినా అది వార్త కాదు.. కానీ పిఠాపురంలో స్కూలు పిల్లలు కొట్టుకున్నా అది పెద్ద వార్తగా మారుతోంది. పిఠాపురం వచ్చి గొడవలు సృష్టించాలనుకునే వారిని ఇక్కడే కూర్చొని ఏరివేస్తాను. గత ప్రభుత్వంలో బూతులు తిట్టడం, కేసులు పెట్టడం చేశారు. ఇప్పుడు మళ్లీ అలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు కఠినంగా వ్యవహరించాలి. నా మాటలు మెత్తగా ఉంటాయి.. కానీ చేతలు గట్టిగా ఉంటాయి. నన్ను లేదా పార్టీని విమర్శించడం భరిస్తాను.. కానీ ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించే వారిని మాత్రం క్షమించను.

సీఎం చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి ఎంతో అవసరం. కూటమి నేతలు పొత్తును బలహీనపరిచే ప్రయత్నాలు చేయొద్దు. ప్రజలను రక్షించడంపై నాకు, చంద్రబాబుకు పూర్తి అవగాహన ఉంది’’ అని పవన్‌కల్యాణ్‌ స్పష్టం చేశారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story