Ysrcp Amarnath : డైవర్షన్‌లో భాగంగానే రిషికొండలో పవన్ కళ్యాణ్ డ్రామా
కూటమి నేతల తీరుపై మండిపడ్డ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్

ప్రజా సమస్యలు పట్టించుకోకుండా కూటమి చేస్తున్న డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగానే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రిషికొండలో డ్రామా చేశారని మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ మండిపడ్డారు. శనివారం ఆయన విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడుతూ రిషికొండలో గత ప్రభుత్వం కట్టిన భవంతుల్లో పవన్ కళ్యాణ్ తన పార్టీ నేతలతో కలియతిరిగి డ్రామా రక్తి కట్టించే ప్రయత్నం చేసి విఫలయమ్యారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు హైదరాబాద్‌లో 200 కోట్లతో పెద్ద భవంతి కడితే అది పూరి గుడిసె, అమరావతిలో ఐదు ఎకరాల్లో రాజభవనం కట్టుకుంటుంటే అది స్కీమ్ ఇల్లు, కానీ వైఎస్ జగన్ ఇల్లు కట్టుకుంటే మాత్రం అది ప్యాలెస్ అని ప్రచారం చేస్తారని అమర్‌నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అవసరాలకు రిషికొండలో భవనాలు నిర్మిస్తే వాటిని జగన్ ప్యాలెస్‌లు అని ప్రచారం చేశారని ఇప్పుడు ప్రభుత్వం జారీ చేసిన జీవోలో రుషికొండ జగన్ ప్యాలెస్ అని ఎందుకు పేర్కొనలేదని అమర్‌నాథ్ కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు. తాజాగా రిషికొండ భవనాలు ఎవరు వాడుకోవాలనే దాని మీద చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్‌ల మధ్య పోటీ నెలకొందన్నారు. రుషికొండకు వెళ్లి అక్కడ జగన్ నిర్మించిన భవనాల వద్ద సెల్ఫీలు తీసుకుంటున్నారని, భవంతిలో సీలింగ్ కట్ చేసి పవన్ పైకప్పు కూలిపోయిందని పవన్, నాదెండ్లలు ఫొటో షూట్ చేశారని మాజీ మంత్రి అమర్‌నాథ్ ఎద్దేవా చేశారు. చంద్రబాబు కట్టిన తాత్కాలిక సచివాలయం చిన్నపాటి వర్షానికే కారిపోతందని, చదరపు అడుగు రూ.13 వేలు ఖర్చుపెట్టి కట్టిన సచివాలయ భవనాల దుస్ధితి పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్‌లు చూశారా అని అమర్‌నాథ్ ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో రిషికొండ భవనాల విషయంలో కూటమి పార్టీ నేతలు దుష్ప్రచారం చేశారని ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన జీవోలో పర్యాటక రిసార్ట్ అని ఎందుకు పేర్కొన్నారని, మీరు తప్పుడు ప్రచారం చేసిన విధంగానే వైఎస్‌జగన్ ప్యాలెస్ అని ఎందుకు ఇవ్వలేదని అమర్‌నాథ్ తీవ్రస్ధాయిలో కూటమి సర్కార్‌ని విమర్శించారు. స్టీల్ ప్లాంట్ విషయంలో ప్రజల నంచి వస్తున్న వ్యతిరేకతను డైవర్ట్ చేయడానికి రుషికొండలో పవన్ డ్రామాకు తెరలేపారని విమర్శించారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్‌లు ఈవెంట్ల కోసం విశాఖపట్నాన్ని, పేమెంట్ల కోసం అమరావతిని వాడుకుంటున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ఆరోపించారు. స్టీల్ ప్లాంట్ విషయంలో మా పార్టీ వైఖరి మారలేదని, వైఎస్‌ఆర్‌సీపీ మొదటి నుంచి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తోందని అమర్‌నాథ్ స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్ విషయంలో కూటమి నేతలైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు ఎన్నో హామీలు ఇచ్చారని ఇప్పుడు ఆ హామీలన్నీ ఏమయ్యాయని మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ప్రశ్నించారు.
