PCC President Y.S. Sharmila: జగన్‌కు అధికారం సరిపోలేదు.. మళ్లీ పాదయాత్ర అంటే ప్రజలు నమ్మరు: షర్మిల
మళ్లీ పాదయాత్ర అంటే ప్రజలు నమ్మరు: షర్మిల

PCC President Y.S. Sharmila: పీసీసీ అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిల మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్‌మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆయనకు అధికారం సరిపోలేదని, ప్రజలు మళ్లీ ఆయన్ని నమ్మరని ఆమె స్పష్టం చేశారు. జగన్ ప్రకటించిన మరో పాదయాత్రను ఆమె తీవ్రంగా ప్రశ్నించారు.
విజయవాడలోని ఆంధ్రరత్న భవన్‌లో గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడిన షర్మిల, "జగన్ అధికారంలోకి వచ్చినప్పుడు సంపూర్ణ మద్య నిషేధం అమలు చేస్తానని చెప్పి కల్తీ మద్యాన్ని ప్రవేశపెట్టి మాఫియాను సృష్టించారు. రుషికొండను బోడిగుండు చేశారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే అన్ని నీటిపారుదల ప్రాజెక్టులు పూర్తి చేస్తానని చెప్పి మాట తప్పారు" అని ఆరోపించారు.
జగన్ ప్రజల మధ్య ఎప్పుడైనా తిరిగారా? అని ప్రశ్నించిన ఆమె, "కనీసం తన పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులకు కూడా అందుబాటులో లేరు. ఎన్నికల ముందు కొన్ని నెలలు సిద్ధం సభలు పెట్టి తిరిగారు తప్ప మరెప్పుడూ కనిపించలేదు. ఏడాదిన్నర తర్వాత చేసే పాదయాత్రకు ఇప్పుడే ప్రకటనలు ఎందుకు? ఎవరిని మోసం చేయాలనుకుంటున్నారు? ఉపాధి హామీ పథకాన్ని చంపకుండా కేంద్రానికి వ్యతిరేకంగా యాత్ర చేయవచ్చు కదా?" అని నిలదీశారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహం లింకన్ మాటను ఉటంకిస్తూ షర్మిల, "మనిషి నైజం తెలియాలంటే అధికారమిచ్చి చూడాలి. జగన్‌కు అధికారం ఇచ్చి చూశాం.. రాష్ట్రం ఏమైందో తెలిసింది. ఆయనలో స్వార్థం తగ్గి, మంచితనం పెరిగే వరకు దేవుడు, ప్రజలు ఆశీర్వదించరు" అని వ్యాఖ్యానించారు.
ఇక ఉపాధి హామీ పథకం విషయంలో మాట్లాడుతూ, షర్మిల రాష్ట్రవ్యాప్తంగా 'ఉపాధి హామీ రక్షణ యాత్ర' చేపడతామని ప్రకటించారు. ఫిబ్రవరి 2 నుంచి అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం బండ్లపల్లి నుంచి ఈ యాత్ర ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ పథకాన్ని 20 ఏళ్ల క్రితం ఇక్కడే యూపీఏ ప్రభుత్వం ప్రారంభించిందని గుర్తు చేశారు.
"దాని స్థానంలో తెచ్చిన వీబీ జీ రామ్ జీ బిల్లుకు రాష్ట్ర కూటమి ఎంపీలు మద్దతిచ్చారు. రాష్ట్ర వాటా నిధులు భరించడం భారమని కేంద్రానికి సీఎం చంద్రబాబు మొరపెట్టుకోవడం ద్వంద్వ వైఖరి కాదా?" అని ఆమె ప్రశ్నించారు.
ఈ యాత్రలో అన్ని పంచాయతీల మీదుగా సాగి, ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరించాలనే డిమాండ్‌ను బలంగా వినిపిస్తామని షర్మిల స్పష్టం చేశారు.

