Pavan Kalyan : ఏనుగులు సంచరించే ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలి
అటవీ శాఖ ఉన్నతాధికారులకు డిప్యూటీ సీయం కల్యాణ్ గారు ఆదేశాలు

- గ్రామస్తులతో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి ముందస్తు సమాచారం ఇవ్వాలి
- అటవీ శాఖ సిబ్బంది ఆయా గ్రామాల్లో నిరంతర పర్యవేక్షణ చేయాలి
చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఏనుగులు గుంపులు గుంపులుగా సంచరిస్తున్న క్రమంలో అటవీ శాఖ సిబ్బంది గ్రామాలలో నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖల మంత్రి పవన్ కల్యాణ్ ఆదేశించారు. సోమవారం ఉదయం అటవీ శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్ ద్వారా ఏనుగుల గుంపుల సంచారం, పంట పొలాలను ధ్వంసం చేయడం, ఏనుగుల దాడిలో ఇటీవల ఒక రైతు దుర్మరణంపై సమీక్షించారు. సోమవారం ఉదయం చంద్రగిరి నియోజకవర్గం పరిధిలో ఏనుగుల గుంపు తిరుగుతూ పొలాలు ధ్వంసం చేసిన ఘటనపై అధికారులు వివరాలు అందించారు. 11 ఏనుగులు (ఇందులో నాలుగు ఏనుగులు పిల్లలు) ఒక గుంపుగా తిరుగుతూ కళ్యాణి డ్యామ్ సమీపంలోని సత్యసాయి ఎస్టీ కాలనీ దగ్గర పొలాలు, తోటలు తొక్కివేశాయని వివరించారు. డ్రోన్ ద్వారా ఏనుగుల గుంపు కదలికలను పరిశీలిస్తున్నట్లు వివరించారు.
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఏనుగులు ఎటువైపు వెళ్తున్నాయి అనేది పరిశీలించడానికి డ్రోన్ టెక్నాలజీ వినియోగిస్తున్న క్రమంలో... అవి వెళ్ళే అవకాశం ఉన్న మార్గాల్లోని గ్రామాలవారిని అప్రమత్తం చేయడంలో ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలన్నారు. గ్రామాలవారీగా వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి వాటికి ఎప్పటికప్పుడు ముందస్తు హెచ్చరికలు పంపించాలని ఆదేశించారు. ఏనుగుల కదలికలు, హెచ్చరిక సందేశాలు పంపించడాన్ని డి.ఎఫ్.ఓ. కార్యాలయాలు, పి.సి.సి.ఎఫ్. కార్యాలయం పర్యవేక్షించాలన్నారు. వీటితోపాటు ఏనుగుల గుంపు పొలాల మీదకి రాకుండా, అటవీ ప్రాంతంలోకి పంపించే చర్యలను పకడ్బందీగా చేపట్టాలని స్పష్టం చేశారు.
