కల్తీ నెయ్యి కుంభకోణంపై తీవ్ర ఆరోపణలు! - తెదేపా ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర

Dhulipalla Narendra Kumar: మండలిలో కల్తీ నెయ్యి వ్యవహారాన్ని సమర్థించిన వైకాపా నేత బొత్స సత్యనారాయణ దేవదేవుడితో ఆటలాడుతున్నారని తెదేపా ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర మండిపడ్డారు. ఇలాంటి వ్యవహారాలు మంచివి కావని, అవి దైవాన్ని అవమానించడమేనని ఆయన అన్నారు.

సంగం డెయిరీకి వైష్ణవి డెయిరీతో లేదా హెరిటేజ్ సంస్థకు ఇందాపూర్‌తో ఎలాంటి సంబంధాలు లేవని స్పష్టం చేశారు. ఈ సంస్థలు ఒకటైతే గత వైకాపా ప్రభుత్వంలో నెయ్యి సరఫరా టెండర్లలో తితిదే ఎందుకు మెయిల్స్ పంపిందని ప్రశ్నించారు. 200 మందికి పైగా పోలీసు బందోబస్తుతో 30 రోజులు సంగం డెయిరీ కార్యాలయంలో సోదాలు జరిగినప్పుడు వైష్ణవి డెయిరీ అంశం ఎందుకు గుర్తించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అసెంబ్లీ మీడియా పాయింట్‌లో బుధవారం విలేకరులతో మాట్లాడిన ధూళిపాళ్ల నరేంద్ర మాట్లాడుతూ, జగన్ జమానాలో కల్తీ నెయ్యి కుంభకోణం నడిపిన నాయకులు ఇప్పుడు మండలిలో సంఖ్యాబలం ఉందని సంబంధం లేని అంశాల్ని చర్చకు తీసుకొస్తున్నారని విమర్శించారు. తితిదేలో అంతర్గతంగా ఉండాల్సిన సంగం టెండర్ కాపీ బయటకు ఎలా వచ్చిందని, భూమన కరుణాకరరెడ్డి గతంలో చెప్పినట్టు తితిదేలో వైకాపా కోసం పనిచేస్తున్న ఉద్యోగులే లీక్ చేశారని ఆరోపించారు. కొందరు ప్రభుత్వంలో ఉంటూ వైకాపాకు అనుకూలంగా పనిచేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

పేదల బియ్యం బొక్కిన కేసు నుంచి తనను, తన సతీమణిని కాపాడమని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కాళ్ల మీద పడి పేర్ని నాని బయటపడ్డారని, అలాంటి ఆయన సంగం మీద అనవసర విమర్శలు చేస్తున్నారని నరేంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాను హిందువునని జగన్ ప్రకటించాలి

తెదేపా ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ, తాను హిందువునని జగన్ బహిరంగంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. మండలి ఛైర్మన్ సభా నిబంధనలు, రాజ్యాంగ విలువల్ని ఖాతరు చేయడం లేదని, ఇలా ఎప్పుడూ జరగలేదని అన్నారు. కల్తీ నెయ్యి వ్యవహారం గురించి చర్చించమంటే వైకాపా ఎమ్మెల్సీలు హెరిటేజ్ మీద ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.

వైకాపా ప్రభుత్వంలో కొండమీద గంజాయి

తెదేపా ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ మాట్లాడుతూ, గత వైకాపా ప్రభుత్వంలో తితిదేలో ఎన్నో అరాచకాలు జరిగాయని, కొండ మీద గంజాయి విక్రయాలు చేశారని, అన్యమత ప్రచారం జరిగిందని ఆరోపించారు. తిరుమల వెళ్లే బస్ టికెట్ల మీద జెరూసలేం యాత్ర ప్రకటన ముద్రించారని, శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగించినట్లు వైవీ సుబ్బారెడ్డే అంగీకరించారని చెప్పారు.

భక్తుల తలనీలాలు అమ్ముకున్న జగన్

తెదేపా ఎమ్మెల్సీ బీద రవిచంద్ర యాదవ్ మాట్లాడుతూ, గత వైకాపా ప్రభుత్వంలో తిరుమల పరకామణిలో చోరీ నుంచి భక్తులు సమర్పించే తలనీలాలు దొంగతనంగా అమ్ముకోవడం వరకూ జగన్, ఆయన బ్యాచ్ హస్తం ఉందని ఆరోపించారు. తిరుమల పవిత్రతను దెబ్బతీయాలని చూసిన డ్రామా ఆర్టిస్ట్ భూమన కరుణాకరరెడ్డి అడ్డంగా దొరికిపోయారని వ్యాఖ్యానించారు. మండలిలో వైకాపా వాళ్లు సుదీర్ఘంగా కల్తీ నెయ్యి అంశం చర్చించారని, తెదేపా, జనసేన, భాజపా సభ్యులు చర్చ మొదలుపెట్టగానే పెద్దగా గలాటా చేస్తూ అడ్డుతగిలారని, చర్చను పక్కదారి పట్టించడానికి హెరిటేజ్ అంశాన్ని తెచ్చారని అన్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story