PM Modi: పీఎం మోదీ: చంద్రబాబు నాయకత్వంలో కొత్త శక్తిగా మారుతున్న ఆంధ్రప్రదేశ్
కొత్త శక్తిగా మారుతున్న ఆంధ్రప్రదేశ్

కర్నూలు ‘సూపర్ జీఎస్టీ- సూపర్ సేవింగ్స్’ సభలో ప్రధాని మోదీ ప్రసంగం
రూ.13,429 కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
జీఎస్టీ సంస్కరణలతో రాష్ట్ర ప్రజలకు రూ.8 వేల కోట్ల ప్రయోజనాలు
21వ శతాబ్దం భారతదేశానిదే: మోదీ
PM Modi: కూటమి ప్రభుత్వ కాలంలో ఆంధ్రప్రదేశ్ ముఖచిత్రం మారుతోందని, చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం కొత్త శక్తిగా అవతరిస్తోందని ప్రధానమంత్రి నరెంద్ర మోదీ ప్రశంసించారు. దేశంలోనూ, రాష్ట్రంలోనూ ఉన్న అవకాశాలు, సామర్థ్యాలను ప్రపంచవ్యాప్తంగా గుర్తించడం జరుగుతోందని అన్నారు. రెండు రోజుల క్రితం గూగుల్ పెద్ద పెట్టుబడిని ప్రకటించినట్లు, దేశంలో మొదటి ఏఐ (కృత్రిమ మేధస్సు) హబ్ నిర్మాణానికి సిద్ధమవుతోందని పేర్కొన్నారు. తయారీ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోందని, ఆత్మనిర్భర్ భారత్ కలను సాకారం చేస్తోందని కొనియాడారు. కర్నూలులో గురువారం జరిగిన ‘సూపర్ జీఎస్టీ - సూపర్ సేవింగ్స్’ బహిరంగ సభలో మోదీ పాల్గొని, రూ.13,429 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
ఈ సమావేశంలో మాట్లాడుతూ, ‘భారతదేశాన్ని నడిపించగల సామర్థ్యం ఆంధ్రప్రదేశ్‌కు ఉంది. కానీ, గత కాంగ్రెస్ ప్రభుత్వాలు రాష్ట్ర సామర్థ్యాన్ని విస్మరించి, దేశానికే నష్టం కలిగించాయి. ఆంధ్రప్రదేశ్‌ను స్వంత అభివృద్ధి కోసం పోరాడాల్సిన దుస్థితిలోకి నెట్టాయి’ అని విమర్శించారు. ‘ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవానికి, సంస్కృతికి నిలయం. సైన్స్, ఆవిష్కరణలకు కేంద్రం. ఇక్కడ అనంత అవకాశాలు, అపార యువశక్తి ఉన్నాయి. 21వ శతాబ్దం భారతీయులది. 140 కోట్ల మంది భారతీయుల శతాబ్దం. 2047 నాటికి మన దేశం వికసిత భారత్‌గా మారుతుంది. వికసిత ఆంధ్రప్రదేశ్‌తోనే వికసిత భారత్ కల నెరవేరుతుంది’ అని ప్రధాని చెప్పారు. ‘కొత్త ప్రాజెక్టుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు ఆంధ్ర ప్రజలకు అభినందనలు. విద్యుత్తు, రోడ్లు, రైల్వే, హైవేలు, వాణిజ్య ప్రాజెక్టులు రాష్ట్ర కనెక్టివిటీని బలోపేతం చేస్తాయి. పరిశ్రమలు ఏర్పడటానికి ఊతమిస్తూ, ప్రజల జీవితాలను మారుస్తాయి. కర్నూలు ప్రాంతాలకు ప్రత్యేక ప్రయోజనాలు కలుగుతాయి’ అని తెలిపారు.
మోదీ ప్రసంగ ప్రధానాంశాలు...
ఇంధన విప్లవానికి ఆంధ్రప్రదేశ్ ప్రధాన కేంద్రం
ఏ దేశమైనా, రాష్ట్రమైనా అభివృద్ధికి విద్యుత్తు భద్రత అత్యవసరం. రూ.3,000 కోట్ల విలువైన ట్రాన్స్‌మిషన్ ప్రాజెక్టుల ప్రారంభంతో దేశ ఇంధన సామర్థ్యం పెరుగుతుంది.
దేశ ఇంధన విప్లవానికి ఆంధ్రప్రదేశ్ కీలకం. చంద్రబాబు నాయకత్వంలో శ్రీకాకుళం నుంచి అంగుల్ వరకు సహజ వాయు ప్రాజెక్టు ప్రారంభం. 15 లక్షల ఇళ్లకు గ్యాస్ అందుతుంది.
చిత్తూరులో ఎల్‌పీజీ బాట్లింగ్ ప్లాంట్ రోజుకు 20,000 సిలిండర్లు నింపే సామర్థ్యం. రవాణా, నిల్వ రంగాల్లో ఉద్యోగాలు పెరుగుతాయి.
గతంలో కాంగ్రెస్ పాలనలో తలసరి ఇంధన వినియోగం 1,000 యూనిట్ల కంటే తక్కువ. విద్యుత్తు కోతలు, గ్రామాల్లో స్తంభాలు లేకపోవడం సమస్యలు. ఇప్పుడు తలసరి విద్యుత్తు వినియోగం 1,400 యూనిట్లు. ప్రతి గ్రామంలో విద్యుదీకరణ పూర్తి.
దేశ రక్షణలో ఆత్మనిర్భరతకు నిమ్మలూరులో అడ్వాన్స్‌డ్ నైట్ విజన్ పరిశ్రమ ప్రారంభం. నైట్ విజన్ పరికరాలు, మిస్సైల్ సెన్సర్లు, డ్రోన్ గార్డులు తయారవుతాయి. రక్షణ ఎగుమతులు పెరుగుతాయి. ఆపరేషన్ సిందూర్‌లో భారత శక్తి ప్రదర్శించాం.
కర్నూలులో డ్రోన్ హబ్ ఏర్పాటు స్వాగతం. దేశానికి తలమానికంగా మారుతుంది. టెక్నాలజీ విస్తరణకు దోహదపడుతుంది. ఆపరేషన్ సిందూర్‌లో డ్రోన్ల అద్భుతాలు ప్రపంచాన్ని ఆకట్టుకున్నాయి.
లోకేశ్ నేతృత్వంలో జీఎస్టీ పొదుపు ఉత్సవం విజయవంతం
నవరాత్రి మొదటి రోజు నుంచి జీఎస్టీ భారం తగ్గించాం. యువ నేత లోకేశ్ నాయకత్వంలో పండగ వాతావరణంలో ఉత్సవం నిర్వహణ. సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ ప్రచారం విజయవంతం.
తర్వాతి తరం జీఎస్టీ సంస్కరణలు రాష్ట్ర ప్రజలకు రూ.8 వేల కోట్ల ప్రయోజనాలు. పండగ సీజన్ ఆనందాన్ని మరింత పెంచుతాయి. స్థానిక తయారీ రంగాన్ని ప్రోత్సహించాలి. ‘వోకల్ ఫర్ లోకల్’కు మద్దతు.
ప్రజల జీవన ప్రమాణాల పెంపు లక్ష్యంగా ఎన్‌డీఏ ప్రభుత్వం పనిచేస్తోంది. సిటిజన్ సెంట్రిక్ అభివృద్ధి మా విజన్. రూ.12 లక్షల వరకు ఆదాయానికి పన్ను మినహాయింపు. తక్కువ ధరల మందులు, మెరుగైన చికిత్స, ఆయుష్మాన్ భారత్ కార్డులతో వృద్ధుల సంరక్షణ.
బహిరంగ సభకు హాజరైన ప్రజలు
వికసిత భారత్ లక్ష్యానికి స్వర్ణాంధ్ర శక్తివంతం
వికసిత భారత్ సాధనకు మల్టీమోడల్ ఇన్‌ఫ్రా ప్రాజెక్టులు వేగంగా అభివృద్ధి. గ్రామం నుంచి పోర్టు వరకు అనుసంధానం. సబ్బవరం-షీలానగర్ హైవే కనెక్టివిటీ మెరుగుపడుతుంది. రైల్వే లైన్లు, ఫ్లైఓవర్లు ప్రయాణికుల సౌకర్యం పెంచుతాయి. పరిశ్రమలకు ఊతం.
2047కి వికసిత భారత్ సాధనకు స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యం శక్తినిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం, యువత టెక్నాలజీలో ముందున్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్‌తో సామర్థ్యం డబుల్ అవుతుంది.
రాయలసీమ ప్రగతికి కొత్త అవకాశాలు
దేశ అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ కీలకం. రాయలసీమ అభివృద్ధి అంతే అవసరం. కర్నూలు ప్రాజెక్టులు పారిశ్రామికాభివృద్ధి వేగవంతం చేసి, ఉద్యోగాలు సృష్టిస్తాయి. ఈ ప్రాంత ప్రగతికి కొత్త ద్వారాలు తెరుస్తాయి.
వేగ అభివృద్ధికి పారిశ్రామిక కారిడార్లు, కేంద్రాలు. ఓర్వకల్లు, కొప్పర్తి నోడ్ల అభివృద్ధి. పెట్టుబడులతో ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. ప్రపంచం భారతదేశాన్ని తయారీ కేంద్రంగా చూస్తోంది. ఆత్మనిర్భర్ భారత్ పునాది.
ఆంధ్రప్రదేశ్‌కు చంద్రబాబు, పవన్ కల్యాణ్ రూపంలో శక్తివంత నాయకత్వం. 16 నెలల ఎన్‌డీఏ పాలనలో వేగ అభివృద్ధి. కేంద్రం పూర్తి మద్దతు. డబుల్ ఇంజిన్ సర్కార్‌తో అపూర్వ ప్రగతి. దిల్లీ, అమరావతి కలిసి అభివృద్ధి వైపు సాగుతున్నాయి.
‘గూగుల్ సీఈఓతో మాట్లాడినప్పుడు తెలిసింది. అమెరికా బయట వారు చాలా పెట్టుబడులు పెట్టాలని భావిస్తున్నారు.’----ప్రధాని మోదీ

