Bhogapuram International Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ
ప్రధాని మోదీ

Bhogapuram International Airport: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోదీని భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ఆహ్వానించారు. ఆగస్టు 1న జరగనున్న ఈ కార్యక్రమానికి ప్రధాని హాజరవుతానని సానుకూలంగా స్పందించారు.
పార్లమెంట్ హౌస్‌లో చంద్రబాబు నాయుడు ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవానికి మోదీని ఆహ్వానించిన చంద్రబాబు, స్థానిక ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడును ప్రధానికి పరిచయం చేశారు. అప్పలనాయుడు రోజూ సైకిల్‌పై పార్లమెంటుకు వస్తున్న విషయాన్ని ప్రధాని మోదీ గుర్తు చేశారు.
సమావేశం సుమారు అరగంట పాటు కొనసాగింది. ఈ సమయంలో తాజా రాజకీయ పరిస్థితులపై చంద్రబాబు, మోదీల మధ్య సుదీర్ఘ చర్చ జరిగింది. ప్రధానిని కలిసినవారిలో కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, శ్రీనివాస వర్మ, ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, కలిశెట్టి అప్పలనాయుడు ఉన్నారు.
ప్రధాని మోదీతో భేటీ అనంతరం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌తో కూడా చంద్రబాబు, కూటమి ఎంపీలు సమావేశమయ్యారు. పోలవరం ప్రాజెక్టు, జల్ జీవన్ మిషన్ అంశాలపై చర్చించారు. పోలవరం ప్రాజెక్టు వర్క్ స్టాప్ ఆర్డర్‌ను పూర్తిగా ఎత్తివేయాలని, ప్రాజెక్టు సందర్శనకు మంత్రి రావాలని చంద్రబాబు కోరారు. ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లోని ముంపు ప్రాంతాల సమస్యలను త్వరగా పరిష్కరించాలని కోరిన చంద్రబాబు, పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టు ప్రతిపాదనల పురోగతిపై కూడా చర్చించారు.

