వరదలకు దెబ్బతిన్న పోలవరం ఎగువ కాఫర్ డ్యామ్
10 అడుగుల వెడల్పు, 8 అడుగుల లోతు వరకూ డ్యామేజ్ అయిన కాఫర్ డ్యామ్

గత పది రోజులుగా కురుస్తున్న కుంభవృష్టికి పోలవరం డ్యామ్‌లోని ఎగువ కాఫర్ డ్యామ్ కూలిపోయింది. దాదాపు పది అడుగుల వెడల్పు, ఎనిమిది అడుగుల లోతులో కాఫర్ డ్యామ్ సీపేజ్ దెబ్బతిన్నట్లు సమాచారం. పోలవరం డ్యామ్‌కి ఎగువన గడచిన పదిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా డ్యామ్‌లోకి వరద నీరు భారీస్ధాయిలో వచ్చి చేరుతోంది. దీంతో నీటి ఉధృతిని తట్టుకోలేక ఎగువ కాఫర్ డ్యామ్‌కు 10 అడుగుల వెడల్పు, 8 అడుగుల లోతులో డ్యామేజి వాటిల్లినట్లు తెలిసింది. భారీగా వచ్చి చేరుతున్న వరదనీటి ఒత్తిడికి ఎగువ కాఫర్ డ్యామ్‌పై మట్టి రాళ్ళు కూలిపోవడాన్ని శనివారం అధికారులు గుర్తించారు. వెంటనే యుద్ద ప్రాతిపదికన మరమ్మతులు నిర్వహించారు. ఇదేవిధంగా 2022 ఆగస్టు మాసంలో వచ్చిన భారీ వదల సమయంలో కూడా ఆనకట్ట ఇలాగే దెబ్బతింది. దీంతో అప్పట్లోనే మరింత వరదలు వస్తే కూడా తట్టుకోవడానికి ఎగువ కాఫర్ డ్యామ్‌ను 9 మీటర్ల వెడల్పు, 2 మీటర్ల ఎత్తుకు బలోపేతం చేశారు. అందువల్ల ఇప్పుడు వచ్చిన భారీ వరదలకు పైన ఎత్తైన ప్రాంతం మాత్రమే ఇప్పుడు కంగిపోయిందని పోలవరం ప్రాజెక్టు అధికారులు వివరించారు. అయితే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కాఫర్ డ్యామ్ దెబ్బతినడం ఇది రెండొవసారి. రెండు సార్లు కాఫర్ డ్యామ్ దెబ్బతిన్నప్పటికీ ఒక్క సారి కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆథారిటీ పోలవరం సందర్శిచలేదు. ఆనకట్ట పరిస్ధితిపై తాజా నివేదిక ఇచ్చే ప్రయత్నం కూడా చేయలేదు.
