ఏపీ అగ్రస్థానం!

Postal Record: భారత తపాలా శాఖ చరిత్రలోనే అపూర్వమైన విజయం సాధించింది. 2026-27 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఇండియా పోస్ట్ ఆదాయం రూ.4 వేల కోట్లను దాటినట్లు కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రకటించారు.
విజ్ఞాన్ భవన్‌లో జరిగిన ఇండియా పోస్ట్ వార్షిక వ్యాపార త్రైమాసిక సమీక్షలో పాల్గొన్న మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ, కేబినెట్ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో కలిసి శాఖ బాధ్యతలు చేపట్టిన తర్వాత తీసుకున్న నిర్మాణాత్మక చర్యల వల్ల ఈ విజయం సాధ్యమైందని వెల్లడించారు.
లక్ష్యాలు మించిన ఆదాయం
ఈ సంవత్సరం ఇండియా పోస్ట్‌కు రూ.19,803 కోట్ల ఆదాయ లక్ష్యం నిర్దేశించగా, తొలి త్రైమాసికంలో రూ.4,950 కోట్లు సాధించాలని లక్ష్యం పెట్టుకుంది. అయితే ఏప్రిల్-జూన్ మధ్యకాలంలో రూ.4,008 కోట్లు సాధించి లక్ష్యానికి దగ్గరగా చేరుకుంది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 22 శాతం ఎక్కువ.
ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో
ఆంధ్రప్రదేశ్ తపాలా విభాగం అద్భుత ప్రదర్శన చేసింది. రాష్ట్రానికి రూ.229.93 కోట్ల ఆదాయ లక్ష్యం నిర్దేశించగా, రూ.233.56 కోట్లు సాధించి 102 శాతం లక్ష్యాన్ని అందుకుంది. దీంతో ఆదాయార్జనలో దేశవ్యాప్తంగా ఏపీ తొలి స్థానం సాధించింది.
అదే సమయంలో తెలంగాణ రాష్ట్రం రూ.224.13 కోట్ల లక్ష్యంలో రూ.157.78 కోట్లు మాత్రమే సాధించి 22వ స్థానంలో నిలిచింది.
ఈ విజయం భారత తపాలా శాఖకు కొత్త ఊపిరి పోసినట్లుంది. మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఈ సాధనకు సంబంధిత అధికారులు, సిబ్బందిని అభినందించారు.

