Chief Minister Nara Chandrababu Naidu: ప్రభుత్వ గృహనిర్మాణ పథకాల కింద 2016కు ముందు ఇంటి పట్టా (గృహపట్టా) పొందిన ప్రతి ఒక్కరికీ ఆ భూమిని అమ్ముకునే, రిజిస్ట్రేషన్ చేసుకునే పూర్తి హక్కు కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. దాన్ని గిఫ్ట్ డీడ్ రూపంలో కూడా ఇచ్చుకోవచ్చని అనుమతి ఇచ్చారు.

ఈ నిర్ణయం రాష్ట్రంలోని సుమారు 75 లక్షల పేద కుటుంబాలకు ప్రత్యక్ష లబ్ధి చేకూర్చనుంది.

ఈనాం భూములకు కూడా విముక్తి

రెవెన్యూ శాఖ సమీక్షలో సీఎం చంద్రబాబు మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

1.37 లక్షల ఎకరాల విలేజి సర్వీస్ ఈనాం భూములను 22-ఎ జాబితా నుంచి తొలగించాలని ఆమోదం తెలిపారు.

మరో లక్ష ఎకరాల ఈనాం భూములకు కూడా నిషేధిత జాబితా నుంచి విముక్తి కల్పించనున్నారు.

ఫ్రీహోల్డ్ కింద రిజిస్ట్రేషన్లు నిలిచిపోయిన 9.25 లక్షల ఎకరాలకు భూ యజమానులకు త్వరలో పూర్తి యాజమాన్య హక్కులు ఇవ్వనున్నారు.

ఈ సమీక్ష సచివాలయంలో బుధవారం జరిగింది. రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, సీఎస్ సాయిప్రసాద్, సీసీఎల్‌ఏ జయలక్ష్మి తదితర అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఈ నిర్ణయాలు పేదలకు ఆస్తి హక్కులు బలోపేతం చేస్తాయని, భూములపై స్పష్టమైన యాజమాన్యం ఏర్పడి ఆర్థిక అభివృద్ధికి దోహదపడతాయని అధికారులు తెలిపారు. త్వరలో సంబంధిత చట్ట సవరణలు, జీవోలు జారీ చేసి అమలు చేయనున్నారు.

Next Story