MP Krishnadevarayalu: పల్నాడు అభివృద్ధికి ప్రధాని హామీ.. మోదీని కలిసిన ఎంపీ కృష్ణదేవరాయలు
ఎంపీ కృష్ణదేవరాయలు

MP Krishnadevarayalu: పల్నాడు జిల్లా అభివృద్ధి, గ్రామీణ ఆర్థిక సాధికారతపై టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వివరించారు. ఢిల్లీలోని ప్రధాని అధికారిక నివాసంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా పల్నాడు జిల్లాలో అమలవుతున్న ‘క్రెడిట్ అవుట్‌రీచ్ ప్రోగ్రామ్’ ప్రగతిపై సమగ్ర నివేదికను ప్రధానికి అందజేశారు. జిల్లాలో 1.03 లక్షల మంది లబ్ధిదారులకు మొత్తం రూ.3,216 కోట్ల మేర రుణాలు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఇందులో తొలిసారి 70 వేల మందికి పైగా లబ్ధిదారులకు రుణ సాయం అందించినట్లు వివరించారు.
వ్యవసాయ రంగానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తూ 83,365 మంది రైతులకు రూ.2,286 కోట్ల మేర రుణాలు అందించినట్లు ఎంపీ పేర్కొన్నారు. రైతులు, చిన్న వ్యాపారులు, స్వయం ఉపాధి వర్గాలకు ఆర్థిక అవకాశాలు పెంచేందుకు జిల్లాలో చేపడుతున్న చర్యలను కూడా వివరించారు.
పల్నాడు జిల్లాలో గ్రామీణ సాధికారత, ఆర్థిక పురోగతి కోసం అమలు చేస్తున్న కార్యక్రమాలపై ప్రధాని మోదీ అభినందనలు తెలిపినట్లు ఎంపీ కృష్ణదేవరాయలు తెలిపారు. ‘వికసిత్ భారత్’ లక్ష్య సాధనలో భాగంగా జిల్లా అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని ప్రధాని హామీ ఇచ్చినట్లు వెల్లడించారు.
జిల్లా ప్రజల ఆర్థికాభివృద్ధికి మరిన్ని అవకాశాలు కల్పించేందుకు కేంద్ర పథకాలను సమర్థవంతంగా వినియోగించుకుంటామని ఎంపీ పేర్కొన్నారు.

