Pawan Kalyan’s Key Remarks: గ్రామ పంచాయతీలకు రావాల్సిన పన్నుల వసూళ్లపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. లాభాలు సంపాదిస్తున్న పరిశ్రమలు, ప్రైవేటు విద్యా సంస్థలు పంచాయతీలకు సరిగా పన్నులు చెల్లించకపోవడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

పంచాయతీరాజ్‌ శాఖ అధికారులతో జరిగిన సమీక్షలో పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతూ, ‘‘గ్రామాల వనరులు వాడుకుంటూ పన్నులు కట్టకపోవడం ఎలా సాధ్యం? లాభాలు సంపాదించే పరిశ్రమలు పన్నులు చెల్లించకపోతే ఎలా?’’ అని ప్రశ్నించారు.

ఆంధ్రా పేపర్‌ మిల్స్‌ ఒక్కటే రూ.19 కోట్ల పన్ను బకాయి పెట్టిందని, విద్యా సంస్థల బకాయిలు కూడా భారీగా ఉన్నాయని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీ పన్నులు పూర్తి స్థాయిలో వసూలు చేస్తే రూ.5,400 కోట్లకు పైగా వచ్చే అవకాశం ఉందని తెలిపారు.

పేదలు, కులవృత్తులు, చిన్న దుకాణదారులు, చిరుద్యోగులు కూడా పన్నులు చెల్లిస్తున్నారని, లాభాలు గడిపే సంస్థలు మాత్రం బకాయి పెట్టడం సరికాదని అభిప్రాయపడ్డారు. రాజకీయ ఒత్తిళ్లు ఉన్నా పన్ను వసూళ్ల విషయంలో కఠినంగా ముందుకెళ్లాలని అధికారులకు ఆదేశించారు.

పల్స్‌ సర్వే తరహాలో స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టి బకాయి పన్నులు వసూలు చేయాలని దిశానిర్దేశం చేశారు. ఈ విషయంలో సీఎం చంద్రబాబు మరియు మంత్రివర్గంతో చర్చించి చర్యలు తీసుకుంటానని పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు.

ఈ సమీక్షలో పంచాయతీరాజ్‌ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story