Chandrababu Naidu: 2029 నాటికి రాష్ట్రంలో పేదలందరికీ పక్కా ఇళ్లు – చంద్రబాబు
చంద్రబాబు

Chandrababu Naidu: ప్రతి కుటుంబానికి కూడు, గూడు, గుడ్డ అందించాలనేదే తమ లక్ష్యమని, 2029 నాటికి ఆంధ్రప్రదేశ్‌లో పేదలందరికీ సొంత పక్కా ఇళ్లు నిర్మించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌తో కలిసి గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం బుర్రిపాలెంలో ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా 3 లక్షల గృహాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
‘పేదలకు పట్టాభిషేకం’ కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారు లక్ష్మి కుటుంబంతో కలిసి ఇంటి నిర్మాణానికి భూమిపూజ చేసి నూతన వస్త్రాలు బహూకరించారు. రూ.14 కోట్లతో 3డీ కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీ ద్వారా 177 ఇళ్ల నిర్మాణానికి చేపట్టిన పైలట్ ప్రాజెక్టుకు కూడా భూమిపూజ చేశారు. రాష్ట్రానికి 3 లక్షల ఇళ్ల మంజూరు పత్రాన్ని కేంద్ర మంత్రి చౌహాన్ సీఎం చంద్రబాబుకు అందించగా, అధికారులు ఎంఓయూ పత్రాలు మార్చుకున్నారు.
పేదలకు ఇల్లు అంటే కేవలం నాలుగు గోడలు కాదని, అది భద్రత, భవిష్యత్తు అని చంద్రబాబు అన్నారు. సొంతిల్లు ఉంటే జీవన ప్రమాణాలు మెరుగుపడటంతో పాటు ఆత్మగౌరవం కూడా పెరుగుతుందని చెప్పారు. రాష్ట్రానికి సాధారణ కోటా కింద 75 వేల ఇళ్లు మాత్రమే మంజూరైనా, ప్రత్యేక విజ్ఞప్తి చేయడంతో కేంద్రం 3 లక్షల ఇళ్లను మంజూరు చేసిందని తెలిపారు. వీటి నిర్మాణం పూర్తయ్యేలోగా మరో 3 లక్షలు, వచ్చే ఏడాది మరో 3 లక్షల గృహాలను మంజూరు చేసేందుకు కేంద్ర మంత్రి అంగీకరించారని ఆయన వెల్లడించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు 5.50 లక్షల ఇళ్లను లబ్ధిదారులకు అందించినట్లు తెలిపారు.
3డీ టెక్నాలజీతో నిర్మించే ఇళ్లలో బయటి ఉష్ణోగ్రత కంటే 8 డిగ్రీలు తక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. 177 ఇళ్లతో ప్రారంభమైన ఈ ప్రయోగం విజయవంతమైతే మరో 5 వేల ఇళ్ల నిర్మాణానికి పూనుకుంటానని, బుర్రిపాలెం స్ఫూర్తితో దీన్ని జాతీయ విధానంగా మార్చుతామని చెప్పారు. పేదలకు పట్టాభిషేకంలో భాగంగా ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న భూసమస్యలను పరిష్కరించి, విశాఖపట్నం, విజయవాడ, మంగళగిరి సహా వివిధ ప్రాంతాల్లో రూ.52 వేల కోట్ల విలువైన స్థలాలను పేదలకు అందించినట్లు తెలిపారు.
గత ప్రభుత్వ హయాంలో పేదలకు ఇచ్చిన ఇళ్లు నివాసయోగ్యం కావని, 4 లక్షల మంది వాటిని తిరస్కరించారని, 17 లక్షల ఇళ్లు మంజూరైతే 6 లక్షలు రద్దు చేశారని చంద్రబాబు విమర్శించారు. భూసేకరణ పేరిట అక్రమాలు జరిగాయని ఆరోపించారు. ప్రస్తుతం రాజముద్రలతో కూడిన పట్టాదారు పాసుపుస్తకాలను రైతులకు అందిస్తున్నామని, సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తూ పింఛన్లకే రూ.76 వేల కోట్లు ఖర్చు చేశామని చెప్పారు.
పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా రూ.1,300 కోట్ల అతి తక్కువ ఖర్చుతో ఇప్పటికే 550 టీఎంసీల నీరు అందుబాటులోకి వచ్చిందని, ఎల్‌నినో వంటి సంక్షోభ పరిస్థితుల్లోనూ కృష్ణా డెల్టాకు గోదావరి నీటిని తరలించి పంటలను కాపాడగలిగామని చంద్రబాబు పేర్కొన్నారు. 2027 మార్చి నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ప్రారంభింపజేస్తామని హామీ ఇచ్చారు.
బుర్రిపాలెం గ్రామం నుంచి ఒకప్పుడు సూపర్‌స్టార్ కృష్ణ ఎదిగారని, ఇప్పుడు పొలిటికల్ హీరోగా పెమ్మసాని చంద్రశేఖర్ ఎదిగారని చంద్రబాబు అన్నారు. శివరాజ్‌సింగ్ చౌహాన్‌ను మధ్యప్రదేశ్‌లో మామ అని పిలుస్తారని, రాష్ట్రంలోనూ ప్రియతమ మామ అని పిలుద్దామని కోరారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రులు కొలుసు పార్థసారథి, నాదెండ్ల మనోహర్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తదితరులు పాల్గొన్నారు.

