‘Putta’ Drugs Case: పుట్టా’ డ్రగ్స్ వ్యవహారం: సీఎం చంద్రబాబు సీరియస్.. ఎంపీ మహేశ్‌కు తెదేపా నోటీసు!
ఎంపీ మహేశ్‌కు తెదేపా నోటీసు!

తెదేపా కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశం
ఎంపీకి ఐదు రోజుల్లో వివరణ ఇవ్వాలని రాష్ట్ర అధ్యక్షుడు పల్లా హెచ్చరిక
‘Putta’ Drugs Case: డ్రగ్స్ కేసులో పట్టుబడిన ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్‌కుమార్ వ్యవహారాన్ని తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్‌గా తీసుకున్నారు. నేతల తప్పుల వల్ల పార్టీ ప్రతిష్టకు ఎలాంటి హాని కలగకుండా చూడాలని స్పష్టమైన హెచ్చరిక ఇచ్చారు. డ్రగ్స్ వంటి విషయాల్లో ఎవరైనా ఉపేక్షించేది లేదని, తప్పు చేసిన వారిని క్షమించబోమని అధినేత సందేశం.
ఈ నేపథ్యంలో తెదేపా కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఎంపీ పుట్టా మహేశ్‌కుమార్‌కు పార్టీ అధిష్ఠానం ఆదేశాలు జారీ చేసింది. మహేశ్‌కు నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని, ఘటనపై పూర్తి నివేదిక సమర్పించాలని రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును చంద్రబాబు సూచించారు. అధినేత ఆదేశాల మేరకు పల్లా శ్రీనివాసరావు ఆదివారం ఎంపీకి నోటీసు పంపారు. ఐదు రోజుల్లో లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని స్పష్టం చేశారు.
నోటీసులో “హైదరాబాద్‌లోని మొయినాబాద్ ఫాం హౌస్‌లో మార్చి 14న జరిగిన ఘటనలో మత్తుపదార్థాలు తీసుకున్నారని మీపై వచ్చిన ఆరోపణలను అధిష్ఠానం తీవ్రంగా పరిగణించింది. ఈ పరిణామాలు పార్టీ ప్రతిష్టకు తీవ్ర భంగం కలిగించేవిగా ఉన్నాయని భావిస్తోంది” అని పేర్కొన్నారు.
ఈ నిర్ణయంతో తెదేపా నాయకత్వం తన అంతర్గత వ్యవస్థను బలోపేతం చేసుకోవాలని, పార్టీకి ఎలాంటి అప్రతిష్ట వచ్చినా సహించబోమని సంకేతం ఇచ్చినట్లు రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

