క్వాంటం కంప్యూటర్లు తయారు చేస్తాం: సీఎం చంద్రబాబు

CM Chandrababu Naidu: ప్రభుత్వ పథకాలు, సేవలు అట్టడుగు వర్గాల వారికి కూడా సమర్థవంతంగా చేరుతున్నట్లు చూసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు ఆదేశించారు. సచివాలయంలో మంత్రులు, వివిధ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు వర్చువల్‌గా పాల్గొన్నారు.

సమావేశంలో రాష్ట్ర జీఎస్‌డీపీ వృద్ధి రేటు, స్వర్ణాంధ్ర @2047 విజన్ లక్ష్యాలు, పది సూత్రాల అమలు, ఆదాయార్జన శాఖల పనితీరు, రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు, పీపీపీ (పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్) ప్రాజెక్టుల పురోగతి వంటి అంశాలపై సీఎం వివరంగా సమీక్షించారు. అలాగే రియల్‌టైమ్ గవర్నెన్స్‌లో సాంకేతికత వినియోగం, అవేర్‌నెస్, డేటా లీక్‌ల నివారణ, పాలనలో ఏఐ టూల్స్ ఉపయోగం, కేంద్ర ప్రాయోజిత పథకాల యాక్షన్ ప్లాన్, యువతకు నైపుణ్యాభివృద్ధి, 'వన్ ఫ్యామిలీ - వన్ ఎంటర్‌ప్రెన్యూర్' విధానం అమలు వంటి కీలక అంశాలపై చర్చ జరిగింది.

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ అధికారులకు దిశానిర్దేశం చేశారు. "గతంలో జిల్లా కలెక్టర్ల సదస్సులు నిర్వహించేవారు కాదు. ఇప్పుడు మూడు నెలలకోసారి నిర్వహిస్తున్నాం. ప్రతి నెలా రెండుసార్లు మంత్రివర్గ భేటీలు జరుగుతున్నాయి. అధికారులు నెలవారీగా సమీక్షలు చేసుకోవాలి. జిల్లా స్థాయిలో కలెక్టర్లు, ఇన్‌ఛార్జ్ మంత్రులు సమర్థవంతంగా పనిచేయాలి" అని ఆయన పేర్కొన్నారు.

ప్రపంచం గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ వైపు వెళ్తున్నదని, అమరావతిని కేంద్రంగా చేసుకొని క్వాంటం కంప్యూటింగ్‌కు శంకుస్థాపన చేశామని సీఎం తెలిపారు. "రెండేళ్లలో అమరావతి నుంచి క్వాంటం కంప్యూటర్లు తయారవుతాయి. మనమే ప్రపంచానికి క్వాంటం కంప్యూటర్లు అందిస్తాం. ఏఐ, క్వాంటం కంప్యూటర్లు, డేటా సెంటర్లతో పెను మార్పులు వస్తాయి" అని ఆయన ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు.

వివిధ శాఖల అధికారులు తమ శాఖల పురోగతిని సీఎంకు వివరించారు. ఈ సమీక్షలో మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story