సునీల్‌నాయక్‌ను తీవ్రంగా విచారించిన దర్యాప్తు అధికారి

Raghu Rama Krishna Raju Case: రఘురామకృష్ణరాజు పై దేశద్రోహం వంటి తీవ్ర సెక్షన్ల కింద కేసు పెట్టాలని ఏ ప్రాతిపదికన సిఫార్సు చేశారు? ఆయన వ్యాఖ్యలు ఉన్న వీడియోలు పరిశీలించారా? ఫోరెన్సిక్ ప్రయోగశాలకు పంపి నిజమని ధృవీకరించుకున్నారా? అంటూ బీహార్ క్యాడర్ ఐపీఎస్ అధికారి ఎం. సునీల్‌నాయక్‌ను దర్యాప్తు అధికారి, విజయనగరం జిల్లా ఎస్పీ ఏ.ఆర్. దామోదర్ తీవ్రంగా ప్రశ్నించినట్లు సమాచారం.

రఘురామకృష్ణరాజు నరసాపురం ఎంపీగా ఉన్న సమయంలో సీఐడీ కస్టడీలో చిత్రహింసలకు గురయ్యారని నమోదైన కేసులో నిందితుడైన సునీల్‌నాయక్ సోమవారం గుంటూరులోని సీసీఎస్‌లో విచారణకు హాజరయ్యారు. దర్యాప్తు అధికారి దామోదర్ ఆయన్ను విచారించారు. 50కి పైగా ప్రశ్నలు అడిగారు. అయితే సునీల్‌నాయక్ ఏ ఒక్క ప్రశ్నకూ సరైన సమాధానం ఇవ్వలేదని తెలిసింది.

ఎఫ్‌ఐఆర్ నమోదు కాకముందే రఘురామను అరెస్టు చేయడానికి హైదరాబాద్‌కు బృందాలను ఎలా పంపించారు? ఇలా చేయడం ముందస్తు కుట్రలో భాగం కాదా? అని ప్రశ్నించగా సునీల్‌నాయక్ నీళ్లు మింగినట్లు మౌనం వహించారని సమాచారం. గుంటూరు సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలోపలికి వెళ్లేటప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా నడుచుకుంటూ వచ్చిన రఘురామకృష్ణరాజు... మరుసటి రోజు కోర్టుకు హాజరుపరచటానికి తీసుకెళ్లేటప్పుడు నడవలేని స్థితిలో ఎందుకు ఉన్నారు? అని అడిగినా తనకు తెలియదని సమాధానం ఇచ్చినట్లు తెలిసింది.

అరెస్టు రోజు రాత్రి రఘురామను నిర్బంధించిన గుంటూరు సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి సునీల్‌నాయక్‌తో పాటు వెళ్లిన గన్‌మ్యాన్, డ్రైవర్‌లను కూడా సోమవారం విచారణకు పిలిపించారు. ఆ రోజు రాత్రి ఎన్ని గంటలకు సునీల్‌నాయక్ సీఐడీ కార్యాలయానికి వచ్చారు? ఆయనతో పాటు ఎవరెవరు ఉన్నారు? తిరిగి ఎన్ని గంటలకు వెళ్లారు? లోపలికి వెళ్లినప్పటి నుంచి బయటకు వచ్చే వరకు ఏమేం జరిగింది? అనే అంశాలపై వారిని ప్రశ్నించారు. అంతకు ముందు సునీల్‌నాయక్‌ను అడిగిన అదే ప్రశ్నలకు డ్రైవర్, గన్‌మ్యాన్‌లు చెప్పిన విషయాలతో పొంతన లేకపోవడంతో ముగ్గుర్ని కలిపి విచారణ జరిపారు.

విచారణ ముగిసిన తర్వాత సునీల్‌నాయక్ తిరిగి వెళ్తున్న సందర్భంలో ఎస్పీ దామోదర్‌తో కలిసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ కేసు సంబంధించి తదుపరి విచారణలు కొనసాగుతాయని సీఐడీ వర్గాలు తెలిపాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story