వైసీపీ ఎమ్మెల్యేల అనర్హతపై కీలక వ్యాఖ్యలు!

Raghu Rama Krishnam Raju Fires on Jagan: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీలో నిర్మాణాత్మక చర్చలు జరగాలంటే జగన్ తప్పనిసరిగా సభకు హాజరు కావాలని సూచించారు. ఇంట్లో కూర్చుని మాట్లాడటం కాదు, అసెంబ్లీలోనే ప్రజా సమస్యలు ప్రస్తావించాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్ష హోదా కోసం జగన్ మరో మూడున్నర సంవత్సరాలు ఎదురుచూడాల్సిందేనని వ్యంగ్యంగా అన్నారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల సమస్యలు చర్చించవచ్చని, అంశానికి తగ్గట్టు సమయం కేటాయిస్తామని రఘురామకృష్ణరాజు స్పష్టం చేశారు.

వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో వైసీపీ ఎమ్మెల్యేల హాజరును బట్టి వారి అనర్హతపై నిర్ణయం తీసుకుంటామని హెచ్చరించారు. 60 పనిదినాలు సభకు హాజరు కాకపోతే రాజ్యాంగం ప్రకారం చర్యలు తీసుకోక తప్పదని తెలిపారు. చంద్రబాబు చివరి రెండేళ్లు సభకు రాలేదని కొందరు చెబుతున్న మాటలు సరికాదని ఆయన కొట్టిపారేశారు.

పవన్ కళ్యాణ్‌పై వ్యాఖ్యలు...

భీమవరం డీఎస్పీ వివాదంపై స్పందిస్తూ.. తాను పవన్ కళ్యాణ్ అభిమానినని, పవన్ ఫ్యాన్స్ తనను తప్పుగా అర్థం చేసుకున్నారని రఘురామకృష్ణరాజు అన్నారు. డీఎస్పీ పనితీరుపై తనకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదని, డిప్యూటీ సీఎంకు ఏమైనా సమాచారం ఉండవచ్చని చెప్పారు. తన నియోజకవర్గంలో డీఎస్పీ పనితీరు తనకు తెలుసు కాబట్టే సమర్థించానని వివరించారు. భీమవరం సబ్ డివిజన్‌కు ఇటీవల బెస్ట్ క్రైమ్ కంట్రోల్ అవార్డు వచ్చిందని గుర్తుచేశారు. డీఎస్పీపై వచ్చిన ఆరోపణలు తప్పుగా ఉండవచ్చని, పవన్‌కు వచ్చిన ఫిర్యాదులు సరైనవి కావచ్చని అన్నారు. విచారణలో అన్నీ బయటపడతాయని తెలిపారు. ‘పవన్ డిప్యూటీ సీఎం, పార్టీ అధినేత.. నేను డిప్యూటీ స్పీకర్ మాత్రమే. ఉండి ఎమ్మెల్యేగా డీఎస్పీ ఇష్యూపై స్పందించాను’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story