Rayalaseema: రాయలసీమకు ₹5,217 కోట్ల పెట్టుబడుల వెల్లువ.. 23 ఒప్పందాలు
23 ఒప్పందాలు

Rayalaseema: రాయలసీమ ప్రాంతాన్ని పారిశ్రామిక తయారీ కేంద్రంగా, గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఆటోమొబైల్ విడిభాగాలు, ఏరోస్పేస్, రక్షణ, ఉక్కు, ఆహార ప్రాసెసింగ్, హాస్పిటాలిటీ రంగాల్లో రూ.5,217.39 కోట్ల పెట్టుబడులకు వీలుగా వివిధ కంపెనీలతో 23 అవగాహన ఒప్పందాలు (ఎంఓయూలు) కుదుర్చుకుంది. ఈ ఒప్పందాల ద్వారా 7,613 మంది స్థానిక యువతకు ప్రత్యక్ష ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.
అనంతపురంలోని జేఎన్‌టీయూలో శుక్రవారం ఆంధ్రప్రదేశ్ ఎకనమిక్ డెవలప్‌మెంట్ బోర్డు (ఏపీ ఈడీబీ), కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) సంయుక్తంగా నిర్వహించిన సీఐఐ ప్రాంతీయ భాగస్వామ్య సదస్సు విజయవంతమైంది. నవంబరు 12, 13 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న 31వ అంతర్జాతీయ భాగస్వామ్య సదస్సుకు సన్నాహకంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. అనంతపురం, శ్రీసత్యసాయి, కర్నూలు, నంద్యాల, కడప జిల్లాల్లోని పారిశ్రామిక అవకాశాలను ఈ సందర్భంగా వెలుగులోకి తెచ్చారు.
కుదిరిన ప్రధాన ఒప్పందాలు:
శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండలోని కియా ప్లాంట్ పరిసరాల్లో ఫోర్ వీలర్ విడిభాగాల తయారీకి ‘హ్వాసిన్ ఆటోమోటివ్’ రూ.850 కోట్లు, ఆటోమొబైల్ ఇంటీరియర్ భాగాల తయారీకి ‘సియోయాన్’ రూ.514 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాయి. కర్నూలులో ‘ఇవామెట్ ఇండియా’ రూ.250 కోట్లతో ఆటోమొబైల్ విడిభాగాల యూనిట్ స్థాపించనుంది.
ఏరోస్పేస్, రక్షణ రంగంలో కర్నూలు జిల్లా ఓర్వకల్లులో రూ.435.75 కోట్లతో 600 ఎకరాల్లో డ్రోన్ సిటీ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. అజిస్తా కాంపోజిట్స్ రూ.810 కోట్లతో ఏరోస్పేస్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయనుంది. వీరా టాక్టికల్ డైనమిక్స్ రక్షణ పరికరాల కోసం రూ.165 కోట్లు, స్టార్మింగ్ యూనివర్స్ డ్రోన్ తయారీకి రూ.50 కోట్లు పెట్టుబడి పెట్టనున్నాయి. శ్రీసత్యసాయి జిల్లా టేకులోడు ఏరోస్పేస్ పార్కులో అడ్వాన్స్‌డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (ఏఎంసీఏ) ప్రాజెక్టు కోసం రూ.2 వేల కోట్లతో ఇంటిగ్రేషన్ కాంప్లెక్స్ రానుంది.
అనంతపురంలో హరిఓమ్ పైప్స్ ఇండస్ట్రీస్ రూ.700 కోట్లతో సమీకృత ఉక్కు కర్మాగారం, కర్నూలులో స్టెడ్ ఫాస్ట్ స్టీల్స్ రూ.536 కోట్లతో ఉక్కు యూనిట్ స్థాపించనున్నాయి.
గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌లో భాగంగా నకోడా డెయిరీ రూ.340 కోట్లతో చిత్తూరులో ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయనుంది.
శ్రీసత్యసాయి జిల్లాలో రూ.115 కోట్లతో మహాజన్ టెక్స్‌టైల్స్, ఉన్నతి టెక్స్‌టైల్స్, లిటిల్ కింగ్ గ్లోబల్ స్పోర్ట్స్‌వేర్ యూనిట్లు స్థాపించనున్నాయి.
అనంతపురంలో వై రిట్రీట్స్ రూ.75 కోట్లతో ఫోర్ స్టార్ హోటల్, సన్‌లార్క్ హాస్పిటాలిటీ కడపలో రూ.56 కోట్లతో హోటల్ నిర్మించనున్నాయి.
రాష్ట్ర ఆహారశుద్ధి శాఖ కార్యదర్శి చిరంజీవి చౌదరి మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కుదిరిన పారిశ్రామిక ఒప్పందాల్లో 70 శాతానికి పైగా అమలవుతున్నాయని తెలిపారు. రెండేళ్లలో రాష్ట్రానికి రూ.22.6 లక్షల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు రాగా, వాటిలో రూ.16.16 లక్షల కోట్లు కేటాయింపుల రూపంలోకి మారాయని ఏపీఐఐసీ ఎండీ దినేష్ కుమార్ వివరించారు.
కార్యక్రమంలో ఏపీ ఈడీబీ సీఈవో షాన్‌మోహన్, అనంతపురం కలెక్టర్ ఓ.ఆనంద్, సీఐఐ ఏపీ వైస్ ఛైర్మన్ జి.సాంబశివరావు, జేఎన్‌టీయూ వీసీ సుదర్శనరావు పాల్గొన్నారు.

