Union Minister Pemmasani Chandrasekhar: అనుమతులు రాగానే అమరావతిలో రీజినల్ పోస్టాఫీస్ నిర్మాణం: కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడి
కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడి

Union Minister Pemmasani Chandrasekhar: అమరావతిలో రీజినల్ పోస్టాఫీస్ వ్యవస్థ నిర్మాణం కోసం అంచనా వ్యయం రూ.50 కోట్ల నుంచి రూ.103 కోట్లకు పెరిగినందున క్యాబినెట్ ఆమోదం కోసం ప్రతిపాదన పంపినట్లు కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. అనుమతులు వచ్చిన వెంటనే నిర్మాణ పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు.
కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా పోస్టల్ శాఖలో తీసుకువచ్చిన సంస్కరణలు, వాటి ఫలితాలపై మంగళవారం ఢిల్లీలో విలేకర్ల సమావేశంలో మంత్రి వివరాలు వెల్లడించారు.
ఆదాయ లక్ష్యాలు:
2024-25లో రూ.13,200 కోట్లుగా ఉన్న ఆదాయాన్ని 2025-26లో రూ.15,300 కోట్లకు పెంచినట్లు చంద్రశేఖర్ తెలిపారు. ఒక్క సంవత్సరంలోనే రూ.2,100 కోట్ల మేర ఆదాయం పెరిగింది. 2026-27లో రూ.20 వేల కోట్ల ఆదాయం సాధించాలని లక్ష్యం నిర్దేశించామన్నారు.
కొత్త సేవలు:
సంప్రదాయ తపాలా సేవలతోపాటు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, షిప్‌రాకెట్ వంటి ఈ-కామర్స్ సంస్థలతో భాగస్వామ్యంతో పార్సెల్ సేవలను విస్తృతం చేయనున్నట్లు వెల్లడించారు. పోస్టాఫీసుకు వెళ్లాల్సిన అవసరం లేకుండా పోస్టల్ బ్యాంక్, ఇన్సూరెన్స్ సేవలను ఆన్‌లైన్‌లో అందించే కొత్త వ్యవస్థను నాలుగైదు నెలల్లో అందుబాటులోకి తెస్తామని తెలిపారు.
బ్యాంకుల కంటే ఎక్కువ వడ్డీరేట్లు ఇచ్చేందుకు అవకాశం ఉందని, యూపీఐ పేమెంట్స్ సౌకర్యంతో పూర్తి డిజిటలైజేషన్ చేసి ఖాతాదారులకు సౌకర్యం కల్పించనున్నట్లు మంత్రి ప్రకటించారు.

