CM Chandrababu: ఏపీపై పారిశ్రామికవేత్తల పెరిగిన విశ్వాసం.. రెండేళ్లలో రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించామని సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడి
సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడి

CM Chandrababu: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంస్కరణలు, సుస్థిర విధానాలు, సులభతర వాణిజ్య వ్యవస్థ, ముందుచూపుతో కూడిన ఆర్థిక ఎజెండా వల్ల పెట్టుబడిదారుల్లో ఆంధ్రప్రదేశ్‌పై విశ్వాసం రెట్టింపు అయిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. దీంతో గత రెండేళ్లలో రాష్ట్రం రూ.23 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షించింది. ఇవి భారీ ఉద్యోగావకాశాలు కల్పించడంతోపాటు రాష్ట్ర దీర్ఘకాలిక ఆర్థికాభివృద్ధికి బలం చేకూరుస్తాయని ఆయన పేర్కొన్నారు.
గురువారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ 11వ పాలక మండలి సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మానవ వనరుల అభివృద్ధి, పేదరిక నిర్మూలన, ఉన్నత శ్రేణి ఉద్యోగాల కల్పన, సామాజిక మౌలిక సదుపాయాల బలోపేతం, నీటి-ఇంధన భద్రత వంటి కీలక అంశాలపై దృష్టి సారించినట్లు వివరించారు.
సాంకేతికత, పారదర్శకతతో పరిపాలన:
సాంకేతికత, పారదర్శకత, జవాబుదారీతనంతో కూడిన పరిపాలనను అమలు చేస్తున్నామని చంద్రబాబు తెలిపారు. రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ ద్వారా వాతావరణం, పంటల స్థితి, భూగర్భజలాలు వంటి 41 రకాల సమాచారాన్ని రియల్ టైమ్‌లో సేకరించి, ఏఐ సాయంతో విశ్లేషించి మెరుగైన సేవలు అందిస్తున్నామన్నారు. ‘మనమిత్ర’ వాట్సాప్ గవర్నెన్స్ యాప్ ద్వారా ప్రభుత్వ సేవలను ఇంటి వద్దే అందిస్తున్నట్లు చెప్పారు.
రాష్ట్రాలు మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టాలని, రెగ్యులేటరీ వ్యవస్థలు స్థిరంగా ఉండాలని, లాజిస్టిక్స్‌ను మెరుగుపరచాలని, పెట్టుబడుల ఆకర్షణకు ప్రోత్సాహకాలపై మాత్రమే ఆధారపడకుండా అనుమతులు వేగంగా ఇవ్వాలని సూచించారు.
ప్రజలందరికీ ఏడు సౌకర్యాలు లక్ష్యం:
గృహనిర్మాణం, పారిశుద్ధ్యం, సురక్షిత తాగునీరు, వంటగ్యాస్, విద్యుత్, డిజిటల్ కనెక్టివిటీ, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (డీబీటీ) వంటి ఏడు సౌకర్యాలను అందరికీ అందించడం రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని చంద్రబాబు ప్రకటించారు. ఇవి సామాన్యుడి జీవన ప్రమాణాలను మెరుగుపరచి సమ్మిళిత అభివృద్ధిని సాధించడంలో కీలకమన్నారు.
సమాజంలోని టాప్ 10% సంపన్నులు, దిగువ 20% కుటుంబాలను దత్తత తీసుకొని వారిని అన్ని విధాలా ఎత్తి నిలబెట్టే ‘పీ4’ విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. వైద్య రంగంలో ‘సంజీవని’ ప్రాజెక్టు ద్వారా వ్యాధులను ముందుగానే గుర్తించి నివారణ చర్యలు చేపడుతున్నామని, డిజిటల్ వ్యవస్థలను ఏర్పాటు చేశామని చెప్పారు. యోగా, ధ్యానం వంటి అలవాట్లను ప్రజల్లో ప్రోత్సహిస్తున్నామన్నారు.
విద్య, నైపుణ్య శిక్షణపై దృష్టి:
భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని విద్యారంగంలో సంస్కరణలు తీసుకురావడంతోపాటు ఏఐ ఆధారిత అభ్యాస విధానాలు ప్రారంభించామని ముఖ్యమంత్రి తెలిపారు. ఉన్నత విద్యను పారిశ్రామిక రంగంతో అనుసంధానం చేసి ఉద్యోగాలకు అనువైన కోర్సులు ప్రవేశపెడుతున్నామని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటం కంప్యూటింగ్ వంటి అధునాతన రంగాల్లో నైపుణ్య శిక్షణ కోర్సులు నిర్వహిస్తున్నట్లు వివరించారు.
జనాభా సమతౌల్యం అవసరం:
ఆంధ్రప్రదేశ్‌లో సంతాన సాఫల్య నిష్పత్తి 1.5కి పడిపోయిందని, భవిష్యత్‌లో మానవవనరుల కొరత, వయోభారం వల్ల ఏర్పడే సమస్యలను గుర్తించి పాపులేషన్ మేనేజ్‌మెంట్ పాలసీ తీసుకొచ్చామని చంద్రబాబు చెప్పారు. అన్ని రాష్ట్రాలు జనాభా సమతౌల్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
భారత్ అభివృద్ధి పరుగులు:
ప్రధాని మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లలో భారతదేశం విధానపరమైన సమస్యల నుంచి బయటపడి అభివృద్ధి దిశగా వేగంగా పరుగులు తీస్తోందని చంద్రబాబు ప్రశంసించారు. సరళీకృత విధానాలు, పాలనా సంస్కరణలు దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశాయన్నారు.
- N. Chandrababu NaiduAndhra PradeshIndustrial InvestmentsInvestment GrowthEconomic DevelopmentChandrababu NaiduInvestor ConfidenceIndustrializationBusiness NewsAP EconomyInfrastructure DevelopmentEconomic GrowthManufacturing SectorGovernment InitiativesInvestment SummitState DevelopmentAndhra Pradesh NewsLatest Telugu NewsBusiness UpdatesEconomic ProgressIndustrial PolicyInvestment Hub

