CM Chandrababu: రాష్ట్రంలో నీటి సమస్యలను పరిష్కరించి, అభివృద్ధిని వేగవంతం చేసేందుకు నదుల అనుసంధానం కీలకమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఇబ్రహీంపట్నం సమీపంలోని కృష్ణా-గోదావరి పవిత్ర సంగమం వద్ద జలహారతి నిర్వహించిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడారు.

రెండేళ్లలో ఇరిగేషన్ ప్రాజెక్టులపై రూ.24 వేల కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. మార్చి 2027 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి దేశానికి అంకితం చేస్తామని ప్రకటించారు. పెన్నా-వంశధార నదుల అనుసంధానం చేయడం లక్ష్యమని, నదుల అనుసంధానం పూర్తి చేస్తే రాష్ట్రానికి కరవు ఉండదని ఆయన వివరించారు.

వచ్చే మూడేళ్లలో రూ.35 వేల కోట్లు ఖర్చు చేసి 36 ప్రాజెక్టులను పూర్తి చేస్తామని సీఎం తెలిపారు. గంగా-కావేరి నదుల అనుసంధానం చేయగలిగితే దేశానికి తిరుగుండదన్నారు. గుంటూరు ఛానల్ ఆధునికీకరణకు ఈ నెలలోనే శంకుస్థాపన చేస్తామని ప్రకటించారు.

పోలవరం ఎడమ కాలువ పనులు పూర్తయ్యాయని, ఆగస్టు 14న అనకాపల్లిలో గోదావరి జలాలకు జలహారతి ఇవ్వనున్నట్లు తెలిపారు. సెప్టెంబరు 1న వెలిగొండ ఫేజ్-1 ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తామన్నారు.

కేఎల్ రావు స్ఫూర్తి:

శ్రీశైలం, నాగార్జునసాగర్ వంటి అతి పెద్ద ప్రాజెక్టుల నిర్మాణంలో కేఎల్ రావు కీలక పాత్ర పోషించారని, ఆయన విజయవాడలో జన్మించడం మన అదృష్టమని సీఎం చంద్రబాబు అన్నారు. నీళ్లు ఎక్కడ ఉంటే అక్కడ అభివృద్ధి జరుగుతుందని వివరించారు.

పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా కృష్ణా డెల్టాను కాపాడిన ఘనత తెలుగుదేశం పార్టీదని, గోదావరి నుంచి కృష్ణా నదికి 450 టీఎంసీలు తీసుకొచ్చామని తెలిపారు. కరవు సీమను హార్టికల్చర్ హబ్‌గా మార్చామన్నారు. గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేసి కియా ఫ్యాక్టరీ ఏర్పాటు చేశామని గుర్తు చేశారు.

అమరావతి నిర్మాణంలో రైతులు 99 శాతం భూములు ఇచ్చారని, ఆగస్టు 15 నాటికి సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తవుతుందని సీఎం వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు రామానాయుడు, అనగాని సత్యప్రసాద్, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని తదితరులు పాల్గొన్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story