CM Chandrababu Issues Clear Directives: రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి 2028 డిసెంబరు నాటికి మంచి రోడ్లు, సమృద్ధిగా తాగునీరు అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసి దశలవారీగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.

ఉండవల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో మంగళవారం ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో సీఎం చంద్రబాబు కీలక సమావేశం నిర్వహించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న వివిధ పథకాలు, కార్యక్రమాలపై ఇరువురు నాయకులు విస్తృత చర్చ జరిపారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని, రోడ్లు, తాగునీటి సమస్యలు తలెత్తకుండా చూడాలని నిర్ణయించారు.

జలజీవన్ మిషన్ కింద ప్రస్తుతం చేపట్టిన, భవిష్యత్తులో చేపట్టబోయే పనులపైనా దృష్టి సారించారు. ఏప్రిల్ నుంచి ప్రారంభమయ్యే 16వ ఆర్థిక సంఘం నిధులు, వీబీ జీరామ్‌జీ పథకం ద్వారా గ్రామాల్లో రోడ్లు, తాగునీటి వ్యవస్థలను బలోపేతం చేయాలని సీఎం సూచించారు. కేంద్ర పథకాలను సమర్థవంతంగా వినియోగించి గ్రామీణ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని అభిప్రాయపడ్డారు. తాగునీరు లేని గ్రామాలకు సమీప జలాశయాల నుంచి నీటిని తీసుకొచ్చే విషయాన్ని పరిశీలించాలని, మూడేళ్లలో దశలవారీగా అన్ని పనులు పూర్తి చేసే ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు నిర్దేశించారు.

సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీల్లో చేపట్టిన ‘మ్యాజిక్ డ్రెయిన్ల’ పనుల వివరాలు సీఎంకు అందించారు. అన్ని పంచాయతీల్లోనూ ఈ తరహా డ్రెయినేజీ వ్యవస్థను నిర్మించి పారిశుద్ధ్య నిర్వహణను పకడ్బందీ చేయాలని సూచించారు. వేసవి కాలంలో నీటిపారుదల శాఖ డ్రెయిన్లలో పూడిక తీత పనులు త్వరగా పూర్తి చేసి రైతులు పంటలు వేసే ముందే సిద్ధం చేయాలని కోరారు. అటవీ శాఖ చేపట్టిన హనుమాన్ ప్రాజెక్టు వివరాలను కూడా సీఎంకు తెలియజేశారు.

సమావేశం అనంతరం ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మీడియాకు ప్రకటన విడుదల చేశారు. “రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నా, గ్రామాల అభివృద్ధికి నిధులు సమకూర్చి పంచాయతీ వ్యవస్థను బలోపేతం చేస్తున్న సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు. జలజీవన్ మిషన్, రోడ్ల నిర్మాణం వేగవంతం చేయడానికి సీఎం ఇచ్చిన విలువైన సూచనలు గ్రామాలను మరింత అభివృద్ధి పథంలోకి నడిపిస్తాయి” అని పవన్ కల్యాణ్ అన్నారు.

ఈ నిర్ణయాలతో రాష్ట్ర గ్రామీణాభివృద్ధి కొత్త ఊపిరి పోసుకోనుంది. మూడేళ్లలో ప్రతి గ్రామం మౌలిక సదుపాయాలతో నిండిపోయేలా ప్రభుత్వం కట్టుబడి ఉంది.

Next Story