CM Chandrababu: మూడో బిడ్డ పుట్టితే రూ.30 వేలు.. నాలుగో బిడ్డకు రూ.40 వేలు: సీఎం చంద్రబాబు
నాలుగో బిడ్డకు రూ.40 వేలు: సీఎం చంద్రబాబు

పిల్లలే సంపద.. పేదరికం లేని సమాజమే లక్ష్యం: సీఎం చంద్రబాబు
CM Chandrababu: పేదరికం లేని సమాజాన్ని నిర్మించడమే తన ప్రధాన కోరిక అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సమాజం మారితేనే స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర సాకారమవుతుందని అన్నారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ, తలసరి ఆదాయం పెంచడం తన ప్రధాన లక్ష్యమని వెల్లడించారు.
సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, ‘‘సంపద సృష్టించి పేదలకు పంచాలి. ఆర్థిక అసమానతలు తగ్గించాలి. ప్రభుత్వానికి మంచి పేరు వచ్చినా అది అధికారుల కృషి వల్లే. ఒకప్పుడు కుటుంబ నియంత్రణను ప్రోత్సహించాం. ఇప్పుడు పిల్లలే సంపద అని చెబుతున్నాం. మూడో బిడ్డ పుట్టిన వెంటనే రూ.30 వేలు, నాలుగో బిడ్డ పుట్టితే రూ.40 వేలు ఇస్తాం. పిల్లలను భారంగా భావించకూడదు, వారే సంపదగా గుర్తించాలి. తల్లులకు వందనం కింద రూ.15 వేలు అందిస్తున్నాం. భగవంతుడు కరుణిస్తే ఈ మొత్తాలను మరింత పెంచుతాం’’ అని ప్రకటించారు.
గత ఐదేళ్లలో గొడ్డలి పార్టీ అరాచకాలను ప్రజలు చూశారని, ప్రజల ఆస్తులను మార్చి గందరగోళం సృష్టించారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల భూములను రక్షించడానికి చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. భూతగాదాలు లేకుండా చేయడం కూటమి ప్రభుత్వ బాధ్యత అని అన్నారు.
స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్రపై ఉద్ఘాటన:
స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర ద్వారా స్వచ్ఛత వైపు అడుగులు వేస్తున్నామని చంద్రబాబు చెప్పారు. స్వచ్ఛమైన ఆలోచనలు, అలవాట్లు మార్చుకోవాలని సూచించారు. గత 16 నెలలుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నామని వివరించారు. ఒకప్పుడు పాదయాత్రల్లో చెత్తే ఎక్కువగా కనిపించేదని, ఇప్పుడు చెత్త నుంచి సంపద సృష్టించే పార్కులు ఏర్పాటు చేశామని తెలిపారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నిషేధించాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ‘ఆపరేషన్ క్లీన్ స్వీప్’ కార్యక్రమాన్ని ఇవాళ్టి నుంచి ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. అన్ని ప్రాంతాల్లో నాలుగు రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుందని, కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రతిరోజూ క్లీన్ డ్రైవ్‌లు నిర్వహించాలని ఆదేశించారు.
అభివృద్ధి ఫలితాలు:
గత 23 నెలల్లో రాష్ట్రానికి రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, ప్రభుత్వం చేసిన ఒప్పందాల ద్వారా 24 లక్షల ఉద్యోగాలు వస్తాయని సీఎం వెల్లడించారు. విశాఖపట్నంలో గూగుల్‌ను తీసుకొచ్చామని, ఉత్తరాంధ్ర నుంచి వలసలు వెళ్లకుండా పరిశ్రమల ద్వారా ఉత్తరాంధ్రకే వలసలు రావాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

