Kuppam Temples : కుప్పంలో ఆలయాల అభివృద్ధికి రూ.50 కోట్లు

కుప్పంలో ఆలయాల అభివృద్ధికి రూ. 50 కోట్లు మంజూరు చేసినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. రెండు రోజుల పాటు కుప్పం పర్యటనలో ఉన్న సీయం నియోజకవర్గంలో ఆలయాలను పునరుద్ధరించేందుకు ప్రణాళిలు చేస్తున్నామన్నారు. పర్యాటక కేంద్రంగానూ కుప్పాన్ని తీర్చిదిద్దుతానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇప్పటికే కుప్పంలో పెద్దయెత్తున గోకులం షెడ్డు నిర్మించామని, ప్రతి ఇంటికీ ఆవులు ఇచ్చామని, ఇప్పుడు అదే ప్రతి ఇంటికీ ఆదాయాన్ని సమకూరుస్తోందని సీయం తెలిపారు. రానున్న రోజుల్లో కుప్పం నుంచి పది లక్షల లీటర్ల పాల ఉత్పత్తి అవుతుందన్నారు. రాయలసీమ హార్టీకల్చర్ హబ్ అయితే దానికి దిక్సూచి కుప్పం అవుతుందన్నారు. కుప్పంలో 10,393 బంగారు కుటుంబాలు ఉన్నాయని, ఈ కుటుంబాలు అన్నింటినీ మార్గదర్శకులతో అనుసంధానం చేస్తామని సీయం చెప్పారు. బిల్‌గేట్స్ ఫౌండేషన్, టాటాలతో కలిసి డిజిటల్ హెల్త్ రికార్డులను తయారు చేస్తామని తెలిపారు. ఎలక్ట్రిక్ ఆటోలతో తడి చెత్త, పొడి చెత్తలను సేకరించే తొలి నియోజకవర్గం కుప్పమని, నియోజకవర్గ ప్రజల ఆరోగ్యం బాగుండాలనేది తన సంకల్పమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు.
