Goa Governor Ashok Gajapathi Raju: రుషికొండ ప్యాలెస్‌ను పిచ్చి ఆసుపత్రిగా మార్చాలి: గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు
పిచ్చి ఆసుపత్రిగా మార్చాలి: గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు

Goa Governor Ashok Gajapathi Raju: ప్రజాధనంతో నిర్మించిన రుషికొండ ప్యాలెస్‌కు ప్రయోజనం లేదని పేర్కొంటూ, దానిని మానసిక వైద్యశాలగా (పిచ్చి ఆసుపత్రిగా) మలచాలని గోవా గవర్నర్ పీ. అశోక్ గజపతిరాజు సూచించారు. బుధవారం విశాఖలో క్షత్రియ సేవా సమితి నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరించిన సందర్భంగా, ఆయన త్యాగాలను స్మరించుకుంటూ ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా ఉండాలన్నారు. గతంలో మంత్రిగా పనిచేసిన తన అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ, “మేము సంక్షేమ కార్యక్రమాల కోసం అప్పులు చేసేవాళ్లం, కానీ గత ప్రభుత్వం అయితే రాష్ట్ర సంపదను తాకట్టు పెట్టింది,” అని విమర్శించారు.
రుషికొండలో రూ.600 కోట్లతో నిర్మించిన భవనం ప్రస్తుతం కూలిపోయే స్థితిలో ఉందని, అన్ని పెచ్చులు ఊడిపోతున్నాయి అని అన్నారు. “అంత భారీ మొత్తం ఉంటే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు పూర్తయ్యేది. ఇప్పుడు ప్రభుత్వం ప్రజలను అడుగుతోంది – ఈ భవనాన్ని ఎలా వాడాలన్నది. నా ఉచిత సలహా – దానిని పిచ్చి ఆసుపత్రిగా మార్చండి. కనీసం దానిని కట్టిన దుర్మార్గులకు ఆ భవనంలోని సముద్ర గాలి తగులుతుంది,” అని తేటతెల్లంగా వ్యాఖ్యానించారు.ప్రజాధనం ప్రజాహితం కోసం వినియోగించాల్సిన అవసరం ఉందని, అప్పట్లో జరిగిన తప్పులను తలచుకుంటూ ప్రజలు మనోధైర్యంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
"స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించిన వీరులకు మనం ఇచ్చే గౌరవం ఏమిటో ఆలోచించాలి. మన సైనికులు ప్రపంచానికి మన సత్తా చాటారు. అన్ని దేశాలకు ఒక పాఠం నేర్పించారు," అని గజపతిరాజు పేర్కొన్నారు.
