Sai Krishna: పోలీసు కస్టడీలో గాయాలతో సాయికృష్ణ మృతి: సీఐ నాగరాజు పై సిట్ సంచలన ఆరోపణలు
సీఐ నాగరాజు పై సిట్ సంచలన ఆరోపణలు

Sai Krishna: విజయవాడలో అదృశ్యమైన గాదె సాయికృష్ణ పోలీసు కస్టడీలోనే తీవ్ర గాయాల కారణంగా మరణించినట్లు సిట్ దర్యాప్తులో బయటపడింది. అతను కృష్ణలంక స్టేషన్ పూర్వ సీఐ నాగరాజు అదుపులో ఉన్నప్పుడే ఈ గాయాలు తగిలినట్లు బలమైన ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని సిట్ రిమాండ్ రిపోర్టులో వెల్లడించింది. మృతుడి ఆచూకీ, కస్టడీ వాస్తవాలు, సీసీటీవీ ఫుటేజీలను నాగరాజు మాయం చేశారని, శవాన్ని దాచిపెట్టడం లేదా రహస్యంగా పారవేయడం జరిగి ఉంటుందని సిట్ సంచలన వ్యాఖ్యలు చేసింది.
సాయికృష్ణను నాన్‌బెయిలబుల్ వారంట్‌పై అరెస్టు చేసినా కోర్టులో హాజరుపరచకుండా అక్రమంగా నిర్బంధించినట్లు సిట్ తప్పుపట్టింది. కస్టడీలో గాయాలవల్లే అతను మృతి చెందినట్లు పరిస్థితుల ఆధారిత సాక్ష్యాల (సర్కమ్‌స్టాన్షియల్ ఎవిడెన్స్)తో నిర్ధారణకు వచ్చింది.
స్టేషన్‌లో రెండు రోజులు మాత్రమే.. ఆ తర్వాత అదృశ్యం
సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి మే మొదటి వారంలో కృష్ణలంక స్టేషన్‌కు వెళ్లి కుమారుడిని లాకప్‌లో తీవ్ర గాయాలతో చూశారు. అతన్ని ఇంటికి పంపించాలని సీఐని వేడుకున్నా స్పందన లేదు. న్యాయవాది కనకదుర్గతో సహా లాయర్లు వెళ్లి విడుదల కోరినా నాగరాజు దుర్భాషలాడారు. ఆధారాల ప్రకారం సాయికృష్ణ మే 6 నుంచి 8 వరకు స్టేషన్‌లో ఉన్నట్లు తెలిసింది. ఆ తర్వాత అతని గతి ఏమైందో తెలియడం లేదు.
హైకోర్టును తప్పుదారి పట్టించిన సీఐ
సాయికృష్ణ ఆచూకీ తెలియదని హైకోర్టుకు రాతపూర్వకంగా సమాధానం ఇచ్చిన నాగరాజు, మార్కాపురం నుంచి అతన్ని తీసుకొచ్చి అదుపులో ఉంచిన విషయాన్ని దాచిపెట్టారు. హైకోర్టు జూన్ 15లోగా సాయికృష్ణను హాజరుపరచాలని ఆదేశించింది.
సీసీటీవీ ఫుటేజీ మాయం
కోర్టు అడిగిన మే 1 నుంచి జూన్ 1 వరకు స్టేషన్ సీసీటీవీ ఫుటేజీలు తుడిచేశారు. కేవలం మే 31, జూన్ 1 ఫుటేజీ మాత్రమే లభ్యమైంది. ఫోరెన్సిక్ నిపుణులు డీవీఆర్‌లను సీజ్ చేసినప్పుడు ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
రాజీ ప్రయత్నాలు, 17 సాక్షులు
మృతదేహం లభ్యం కాకపోయినా సర్కమ్‌స్టాన్షియల్ ఎవిడెన్స్‌తో సాయికృష్ణ కస్టడీలోనే మరణించినట్లు సిట్ నిర్ధారించింది. 17 మంది సాక్షులను పేర్కొంది. నాగరాజు మధ్యవర్తుల ద్వారా రాజీకి ప్రయత్నించినట్లు సాయికృష్ణ మేనమామ నవరంగ్ తెలిపారు. తల్లి విజయలక్ష్మి, మేనమామ నాగేశ్వరరావు, పిన్ని కనకదుర్గలు కీలక ఆధారాలు అందించారు.
ఈ కేసులో సీఐ నాగరాజును సిట్ అధికారులు విజయవాడ కోర్టులో హాజరుపరిచారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.

