CM Chandrababu: 2027 జనవరి 1వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా సంజీవని ప్రాజెక్ట్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. బుధవారం రాజధాని అమరావతిలోని ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో వైద్య, ఆరోగ్య సేవలు, సంజీవని ప్రాజెక్ట్‌పై ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

కుప్పం, చిత్తూరు ప్రాంతాల్లో ఈ ప్రాజెక్ట్ అమలు ద్వారా మంచి ఫలితాలు వస్తున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా విస్తరించేందుకు రూపొందించిన 90 రోజుల కార్యాచరణను అధికారులు సీఎంకు వివరించారు. ఆ ఫలితాలను ఆధారంగా చేసుకుని మరిన్ని చర్యలు చేపట్టాలని సీఎం సూచించారు.

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఏఐ ఆధారిత ఆరోగ్య సేవలకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని చంద్రబాబు స్పష్టం చేశారు. డిజిటల్ హెల్త్ రికార్డులు, వ్యాధుల ముందస్తు గుర్తింపు, చికిత్స, ఫాలోఅప్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. డిజిటల్ హెల్త్ రికార్డులతో ప్రాజెక్టు పూర్తిస్థాయిలో అమలైతే వైద్యసేవల్లో అనూహ్య మార్పులు సాధించవచ్చని ఆయన అన్నారు. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్‌ను ఇతర రాష్ట్రాలు అనుసరించేలా సంజీవని ప్రాజెక్టును విజయవంతం చేయాలని సూచించారు.

ప్రజల ఆరోగ్య డేటా గోప్యత, భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ మొబైళ్లకు నేరుగా హెల్త్ అప్‌డేట్స్ పంపేలా వ్యవస్థను రూపొందించాలని సీఎం ఆదేశించారు. ప్రతి కుటుంబంపై వైద్యం, విద్య ఖర్చుల భారాన్ని తగ్గించడంతో పాటు వ్యాధుల ముందస్తు గుర్తింపు, నివారణ, చికిత్సకు ఈ ప్రాజెక్టు దోహదపడేలా ప్రభుత్వం చర్యలు చేపట్టనుందని తెలిపారు.

ఈ సమీక్షా సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి వీర పాండ్యన్‌తోపాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

Next Story