ఇప్పటివరకు 1317 కేసులు నమోదు, ఒక మరణం

ఆంధ్రప్రదేశ్‌లో స్క్రబ్ టైఫస్ వ్యాధి భయానకంగా వ్యాపిస్తోంది. పురుగు కాటు ద్వారా సోకే ఈ వ్యాధి శ్రీకాకుళం నుంచి మొదలై, ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తూ ప్రజల్ని భయబ్రాంతులకు గురిచేస్తోంది. డిసెంబర్ 1 నాటికి రాష్ట్రంలో మొత్తం 1317 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ వ్యాధి బారిన పడి విజయనగరం జిల్లాకు చెందిన ఓ మహిళ మృతి చెందడంతో ఆందోళన మరింత పెరిగింది.

విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం మిట్టపల్లి గ్రామానికి చెందిన ఆ మహిళ గత కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతూ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. అక్కడి వైద్యులు పరీక్షలు చేసి స్క్రబ్ టైఫస్ సోకినట్లు నిర్ధారించారు. చికిత్స అందిస్తూ ఉండగా పరిస్థితి విషమించి ఆమె కన్నుమూశారు.

వైద్య ఆరోగ్య శాఖ అధికారులు విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 379 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత కాకినాడలో 141, విశాఖపట్నంలో 123 కేసులతో ఈ మూడు జిల్లాలు అత్యంత దెబ్బతిన్నాయి. మిగతా జిల్లాల వివరాలు: కడప 94, నెల్లూరు 86, అనంతపురం 68, తిరుపతి 64, విజయనగరం 59, కర్నూలు 42, అనకాపల్లి 41, శ్రీకాకుళం 34, అన్నమయ్య 32, గుంటూరు 31, నంద్యాల 30.

స్క్రబ్ టైఫస్‌కు 'లార్వల్ మైట్స్' అనే చిన్న పురుగుల కాటే కారణమని వైద్యులు తెలిపారు. ఈ పురుగులు ప్రధానంగా వ్యవసాయ పొలాలు, కొండ ప్రాంతాలు, అపరిశుభ్రమైన చోట్ల, చెత్తాచెదారం, మురుగునీటి ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. శీతాకాలంలో ఈ వ్యాధి మరింత ఉధృతంగా వ్యాపిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

వ్యాధి లక్షణాలు కనిపించగానే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. సకాలంలో గుర్తించి యాంటీబయాటిక్స్ మందులు వాడితే పూర్తిగా నయమవుతుందని భరోసా ఇస్తున్నారు. ముందు జాగ్రత్తగా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం, పొలాలకు వెళ్లేటప్పుడు పూర్తి దుస్తులు ధరించడం, చెత్త చెదారాన్ని తొలగించడం వంటి చర్యలు తీసుకోవాలని సలహా ఇస్తున్నారు.

మూడేళ్ల క్రితం కూడా శ్రీకాకుళంలో ఈ వ్యాధి వ్యాపించినా, అధికారులు త్వరితగతిన చర్యలు తీసుకుని నియంత్రణలోకి తెచ్చారు. ఇప్పుడు మళ్లీ అప్రమత్తమైన ప్రభుత్వం పారిశుద్ధ్య కార్యక్రమాలు, వైద్య శిబిరాలు నిర్వహిస్తూ వ్యాధిని అరికట్టేందుకు కృషి చేస్తోంది. ప్రజలు ఈ వ్యాధి పట్ల జాగ్రత్తగా ఉండాలని వైద్యులు, అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story