Capital Amaravati : రెండు విడతలుగా రాజధాని రెండో దశ భూసమీకరణ

- రాజధాని భూ సేకరణపై ప్రభుత్వ నిర్ణయం
- తొలి విడతలో 32 వేల ఎకరాలు
- త్వరలో భూసమీకరణకు నోటిఫికేషన్
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కోసం రెండో విడత భూ సమీకరణ విషయమై రాష్ట్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ సారి రాజధాని విస్తరణ కోసం కావాల్సిన 44 వేల ఎకరాల భూమిని రెండు విడతల్లో సమీకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో మొదటి విడతగా 32 వేల ఎకరాలను రాజధాని నిర్మాణానికి పూలింగ్ చెయ్యడానికి కూటమి ప్రభుత్వం సిద్దమవుతోంది. ఈ మొదటి విడత ల్యాండ్ పూలింగ్ పట్టాలు ఎక్కిన తరువాత అచ్చంగా అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించడం కోసం మరో పది నుంచి 12వేల ఎకరాలను సమీకరించాలని చంద్రబాబు సర్కార్ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. అంటే మొత్తంగా రెండో దశ ల్యాండ్ పూలింగ్ లో మొదటి విడత 32వేల ఎకరాలు, రెండో విడత 12వేల ఎకరాలు కలిపి 44వేల ఎకరాలను ఇప్పటి వరకూ సేకరించిన భూమికి అదనంగా సేకరించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమాయత్తం అవుతోంది. క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అధారిటీ గత మంగళవారం విడుదల చేసిన నిబంధనల్లో సైతం అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయానికి భూములు ఇచ్చే రైతులకు ఒకే చోట అభివృద్ధి చేసిన భూములు ఇస్తామని ప్రత్యేకంగా పేర్కొన్నారు. విమానాశ్రయం నిర్మాణం, అభివృద్ది, నిర్వహణ ప్రవేటు సంస్ధలకు అప్పగించే అవకాశం ఉండటంతో అక్కడ రిటర్నబుల్ ప్లాట్లు డెవలపర్ల వాటా కింద ఇవ్వాల్సినవి ఒక ప్రాంతంలో, రైతలకు ఒక ప్రాంతంలో ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఇటీవల జరిగిన అథారిటీ సమావేశంలో భూ సమీకరణపై జరిగిన చర్చలో తొలిదశలో మూడు మండలాల పరిధిలో 32 వేల ఎకరాలు తీసుకునేందుకు ఆమోదం తెలిపారు. దీనిపై ఈ వారంలోనే జిల్లా అధికారులు నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. తరువాత గ్రామాల వారీ నోటిఫికేషన్ ఇచ్చి సభలు నిర్వహించనున్నారు. తొలిదశలో అమరావతి మండల పరిధిలోని వైకుంఠపురం, పెదమద్దూరు, యండ్రాయి, కర్లపూడి గ్రామాలు ఉన్నాయి. తుళ్లూరు మండల పరిధిలోని హరిశ్చంద్రాపురం, వడ్డమాను, పెదపరిమి గ్రామాలను కూడా భూ సమీకరణ పరిధిలో ఖరారు చేశారు. తాడికొండ మండలంలో ఏ గ్రామాన్ని తీసుకోవాలనే విషయంపై ఇంకా మీమాంశలో ఉన్నట్లు తెలిసింది.
ఇక రెండోదశలో భూములు తీసుకునేందుకు పెదకూరపాడు మండలంలోని రెండు గ్రామాలు, తాడికొండ మండలం పరిధిలోని రెండు గ్రామాలను ఎంపిక చేశారు. అవసరాన్ని బట్టి గ్రామాల సంఖ్యను పెంచే అవకాశమూ ఉంది. ఇప్పటికే పెదకూరపాడు ఎమ్మెల్యే ఎనిమిది గ్రామాల్లో సభలు పూర్తి చేశారు. పాత అమరావతి గ్రామలో ల్యాండ్ పూలింగు చేయాలా వద్దా అనే అంశంపై కొంత తర్జన భర్జన పడుతున్నారు. ఈ గ్రామంలో ఎక్కువశాతం లేఅవుట్లు వేసి ఉండటంతో ప్రభుత్వానికి భూమి ఎంత మిగులుతుందనే అంశంపై లెక్కలు ఖరారు కాకపోవడంతో అమరావతి గ్రామాన్ని తీసుకోవాలా వద్దా అనే అంశంపై స్పష్టత రాలేదని తెలుస్తోంది.
