వైఎస్‌ఆర్‌సీపీ పార్టీ నేతలతో సజ్జల, బొత్స టెలికాన్ఫరెన్స్‌

  • ఆగష్టు 31 నాటికి బీఎల్‌ఏ జాబితాలు కేంద్ర కార్యాలయానికి పంపాలి
  • 20 బూత్‌లకు స్ధానికంగా ఉండే ఒక సీనియర్‌ నాయకుడిని టాస్క్‌ఫోర్స్‌ టీమ్‌గా నియమించాలి
  • కలెక్టరేట్‌తో సమన్వయం చేసుకుంటూ ఈసీ స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌పై అప్రమత్తంగా ఉండాలి
  • బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమం పెండింగ్‌ ప్రాంతాల్లో వెంటనే పూర్తిచేయాలి
  • ఈ నెలాఖరికల్లా గ్రామ, మండల స్ధాయిలో పార్టీ కమిటీల నియామకాలు

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ బూత్‌ లెవల్ ఏజెంట్ల నియామకంపై పార్టీ నాయకులంతా సీరియస్‌గా దృష్టిపెట్టాలని పార్టీ స్టేట్‌ కోఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి నాయకుకు సూచించారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రీజనల్‌ కోఆర్డినేటర్లు, పార్టీ జిల్లా అధ్యక్షులు, పార్లమెంట్‌ నియోజకవర్గాల పరిశీలకులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు (కోఆర్డినేషన్‌), రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (అనుబంధ విభాగాల ఇంఛార్జ్‌) రాష్ట్ర కార్యదర్శులు (కోఆర్డినేషన్‌), ఎంపీలు, పార్లమెంట్‌ నియోజకవర్గ సమన్వయకర్తలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంఛార్జ్‌లతో పార్టీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, శాసనమండలిలో ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణలు టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈసందర్భంగా సజ్జల మాట్లాడుతూ ఎన్నికల కమిషన్‌ కూడా బూత్‌ కమిటీలపై పై దృష్టిపెట్టిందని దేశమంతా కూడా స్పెషల్ ఇంటెన్సివ్‌ రివిజన్‌ చేయబోతున్నారని ఇందులో పోలింగ్‌ బూత్‌ నెంబర్‌, లొకేషన్‌, పోలింగ్‌ బూత్‌లకు అనుసంధానించిన ఓటర్ల రీలొకేషన్‌ వంటి కీలక అంశాలపై ఇప్పటికే అధికారుల నుంచి రాజకీయ పార్టీలకు సమాచారం వచ్చిందని సజ్జల వైసీపీ నేతలకు వివరించారు. ఉదాహరణకు అనంతపురం జిల్లాలో మొత్తం 330 పోలింగ్‌ బూత్‌లు పెరుగుతున్నాయి. ఏ బూత్ లోనైనా ఓటర్లు ఎక్కువగా ఉంటే అందులో నుంచి కొంతమందిని కొత్త బూత్‌లోకి మార్చడం ఇలాంటి ప్రపోజల్స్‌ సిద్దమయ్యాయని వివరించారు. దీనిపై మన అధ్యక్షుడు వైఎస్‌.జగన్‌ అందరూ అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే చెప్పారని గుర్తు చేశారు. ఈ విషయంపై మనమంతా పూర్తి అవగాహనతో ఉండాలని సజ్జల సూచించారు. ఎలక్టోరల్‌ రోల్స్‌కు సంబంధించి బూత్‌ లెవల్‌ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలి. వీరంతా బూత్‌ లెవల్‌ ఆఫీసర్‌తో సమన్వయం చేసుకుంటూ ఉండాలి, ఏ మాత్రం ఏమరుపాటు వద్దని అన్నారు. బూత్ కమిటీలను మనం నియమించుకోవడం ప్రధాన కర్తవ్యం, ఓటర్‌ లిస్ట్‌పై పూర్తి అవగాహన కలిగి ఉండాలి. మనం ఇప్పటినుంచే దీనిపై దృష్టిపెట్టినప్పుడే ఎన్నికల సమయంలో కీలకంగా ఉపయోగపడుతుందని సజ్జల చెప్పారు

బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమం జరుగుతున్న తీరుపై పార్టీ అధ్యక్షుడు జగన్‌ ఫాలోఅప్‌ చేస్తున్నారని అందరూ దీనిని సీరియస్‌గా తీసుకోవాలని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. గ్రామస్ధాయిలో కమిటీల నియామకం కూడా వెంటనే పూర్తిచేయాలి. కమిటీల నియామకాలు అన్నీ పూర్తయితే ఏ కార్యక్రమం చేసినా ఒక్కో నియోజకవర్గంలో 5 వేల మందికి పైగా హాజరవుతారు. పార్టీ నిర్మాణం సరిగా ఉన్నప్పుడే గెలుపు సులభం అవుతుందన్నారు. ఈ వారం, పదిరోజుల్లో మండల స్ధాయిలో కమిటీలు పూర్తికావాలి, గ్రామస్ధాయి కమిటీలపై కూడా సీరియస్‌గా దృష్టిపెట్టాలి. ఈ నెలాఖరికల్లా కేంద్ర కార్యాలయానికి కమిటీల జాబితాలు పంపాలని సజ్జల పార్టీ నేతలను ఆదేశించారు. అనంతరం టెలికాన్ఫరెన్స్‌లో పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ బూత్ లెవల్ ఏజెంట్లకు సంబంధించిన విధులు, పార్టీ గైడ్‌లైన్స్‌ అందరూ పాటిద్దాం. జిల్లా పార్టీ అధ్యక్షులు కలెక్టరేట్‌తో సమన్వయం చేసుకుంటే మరింత ఉపయోగకరంగా ఉంటుంది. దీనిపై మనం అప్రమత్తంగా ఉండాలి, మరోసారి సమీక్ష చేసుకుని అందరం సమన్వయంతో ముందుకెళదామని బొత్స సత్యనారాయణ అన్నారు.

Updated On 21 Aug 2025 4:06 PM IST
Politent News Web 1

Politent News Web 1

Next Story