Shivraj Singh Chouhan Becomes the ‘Mama’ of AP People: ఏపీ ప్రజలకు 'మామ'గా శివరాజ్‌సింగ్ చౌహాన్: గుంటూరులో చెరువు పునరుద్ధరణను పరిశీలించిన మంత్రి
గుంటూరులో చెరువు పునరుద్ధరణను పరిశీలించిన మంత్రి

Shivraj Singh Chouhan Becomes the ‘Mama’ of AP People: ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ల కలయిక అద్భుతమని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అభిప్రాయపడ్డారు. ఈ ముగ్గురూ కలిసి ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా వెంగళాయపాలెం చెరువు వద్ద వాటర్ షెడ్ పథకం కింద రూ. 1.20 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్యేలతో కలిసి శివరాజ్ సింగ్ పరిశీలించారు. మొదట పూజలు చేసిన తర్వాత పైలాన్‌ను ఆవిష్కరించి, మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...
వెంగళాయపాలెం చెరువు పునరుద్ధరణ చూసి చాలా సంతోషం వేసిందని శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. పురాతన చెరువును అత్యాధునిక వసతులతో మార్చి మెరుగుపరిచారని, దీని ద్వారా ప్రాంతంలో భూగర్భజలాలు పెరిగి, పశువులకు తాగునీరు అందుతుందని ఆయన పేర్కొన్నారు. మత్స్యరంగాన్ని బలోపేతం చేయడానికి, బోటింగ్ సౌకర్యాలకు ఉపయోగపడుతుందని చెప్పారు. వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్, ఓపెన్ థియేటర్ వంటి సౌకర్యాలు ప్రజలకు ఆనందాన్ని, ఆరోగ్యాన్ని అందిస్తాయని ఆయన అన్నారు. తక్కువ ఖర్చుతో ఇంత గొప్ప సౌకర్యాలు కల్పించిన పెమ్మసాని చంద్రశేఖర్, బూర్ల రామాంజనేయులకు శివరాజ్ సింగ్ అభినందాలు తెలిపారు.
దిల్లీలో జరిగిన పేలుళ్ల ఘటనలో మరణించిన వారికి ఈ వేదిక నుంచి శ్రద్ధాంజలులు అర్పించుకున్నారు. కేంద్ర మంత్రి పదవి కంటే ప్రజల సేవే పెద్దదని, ప్రజాసేవను దైవపూజలా భావిస్తానని ఆయన చెప్పారు. మధ్యప్రదేశ్‌లో ప్రజలు తనను 'మామ' అని పిలుస్తారని, ఇకపై ఏపీ ప్రజలకు కూడా తాను 'మామ'నే అని శివరాజ్ సింగ్ స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా ఇలాంటి చెరువుల పునరుద్ధరణ ప్రణాళికలు అమలు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

