Sibling wars in Telugu states!

తెలుగు రాష్ట్రాల్లో కుటుంబ రాజకీయాలు, కుటుంబ రాజ‌కీయ విభేదాలు ఎక్కువ‌వుతున్నాయి. ముఖ్యంగా అన్నా చెల్లెల్ల‌ మధ్య రాజకీయ విభేదాలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయిపోయాయి. వైయస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డితో ఆయన సోదరి షర్మిల విభేదిస్తున్న వ్య‌వ‌హారం తెలుగు రాష్ట్రాల్లో అంద‌రికీ తెలిసిందే. గ‌తేడాది జ‌రిగిన ఎన్నికల్లో అన్న జ‌గ‌న్ ఓటమి ల‌క్ష్యంగా కంకణం కట్టుకొని విజయం సాధించారు షర్మిల. ఇప్పుడు తెలంగాణలోనూ అదే పరిస్థితి కొనసాగుతోంది. కేసీఆర్ కుమారుడు కేటీఆర్ తో సోదరి కవిత విభేదిస్తున్నారు. తన తండ్రి కేసీఆర్ ను తప్పు దోవ పట్టిస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. అయితే, ఏపీలో ఇప్పుడు మరో అన్నా చెల్లెల్ల ఎపిసోడ్ న‌డుస్తోది. రాజకీయంగా అన్నా చెల్లెళ్లు విభేదించుకుంటున్నారు. వాళ్లెవ‌రో కాదు.. సీనియర్ నాయ‌కుడు ముద్రగడ పద్మనాభం కుమారుడు గిరి, ఆయ‌న కూతురు క్రాంతి. ఇప్పుడు వీళ్లిద్ద‌రి మధ్య పొలిటికల్ వార్ నడుస్తోంది. తన తండ్రిని కలవకుండా సోదరుడు గిరి అడ్డుకుంటున్నారంటూ క్రాంతి సంచలన ఆరోపణలు చేశారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న తన తండ్రిని కలవనివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ఓ బ‌హిరంగ లేఖ కూడా రాశారు. ఆ లేఖ ఇప్పుడు వైర‌ల్ అవుతోంది.



జనసేన అధినేత పవన్ క‌ల్యాణ్ విషయంలో ముద్రగడ పద్మనాభం ఎన్నికలకు ముందు సంచలన ఆరోపణలు చేశారు. అంతటితో ఊరుకోకుండా.. తన కుమారుడితో కలిసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎట్టి పరిస్థితుల్లో పిఠాపురంలో పవన్ కళ్యాణ్‌ను ఓడిస్తానని కూడా ముద్రగడ శపథం చేశారు. పవన్‌కల్యాణ్‌ను ఓడించకపోతే.. తన పేరును ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానని సవాల్ చేశారు. ఇదే లక్ష్యంతో పిఠాపురంలో పవన్ కళ్యాణ్‌ను ఓడించేందుకు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అయితే, ఫలితం లేకుండా పోయింది. చివరకు పవన్ కళ్యాణ్ గెలిచేస‌రికి తన పేరును ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకోవాల్సి వచ్చింది.



అయితే, తన తండ్రి వ్యాఖ్యలను మొదటినుంచీ తప్పుబడుతూనే ఉన్నారు ముద్రగడ పద్మనాభం కూతురు క్రాంతి. అంతేకాదు.. గత యేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమె జనసేన పార్టీలో చేరేందుకు సిద్ధపడ్డారు. అయితే, పవన్ కల్యాణ్‌ అప్పుడు వద్దని వారించారు. ఎన్నికల్లో జనసేన పార్టీ విజయదుందుభి మోగించిన తర్వాత.. కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంతో క్రాంతి.. ఎన్నికల అనంతరం జనసేన పార్టీలో చేరారు. అప్పటినుంచి ముద్రగడ కుటుంబంలో విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే ముద్రగడ పద్మనాభంను కలిసేందుకు ఆయన కూతురు క్రాంతి ఇటీవల ప్రయత్నం చేశారు. కానీ, ఆమెను కలవకుండా కుమారుడు గిరి అడ్డుకుంటున్నారన్న వాదనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ముద్రగడ కూతురు క్రాంతి సోషల్ మీడియాలో ఒక లేఖ పోస్ట్‌ చేశారు. తన తండ్రి ముద్రగడ పద్మనాభం క్యాన్సర్ తో బాధపడుతున్నారని.. ఆయనను చూసేందుకు సైతం తనను అనుమతించడం లేదని.. తన సోదరుడు గిరితో పాటు ఆయన భార్య తరపు బంధువులు ముద్రగడ పద్మనాభంను బంధించారని సంచలన ఆరోపణలు చేశారు. ఈ పరిణామాలు ఇది ముద్రగడ కుటుంబంలో ఉన్న విభేదాలను బయటపెట్టాయి. ముద్రగడ అంటే రాజకీయ నేతగా కాకుండా.. కాపు రిజర్వేషన్ పోరాట సమితి నాయకుడిగానే మొదటినుంచీ గుర్తింపు పొందారు. అటువంటి నాయకుడి కుటుంబంలో ఇద్దరు పిల్లలు విడిపోయి, విభేదించుకోవడంపై ముద్రగడ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ విషయంలో కాపు ప్రతినిధులు చొరవ చూపాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ఇటీవల తుని రైలు దహనం కేసులో ముద్రగడ పద్మనాభం పై కోర్టులో అపీల్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఉత్తర్వులను కూడా జారీ చేసింది. కానీ ఆ మరుసటి రోజునే ఆ ఉత్తర్వులను వెనక్కి తీసుకుంటూ జీవో జారీ చేసింది. కాపు ఉద్యమంలో భాగంగా తునిలో రైలు దహనమైన సంగతి తెలిసిందే. ఆ కేసులో ప్రధాన నిందితుడిగా ముద్రగడ పద్మనాభం ఉన్నారు. వైసిపి హయాంలో విజయవాడ రైల్వే కోర్టు ఆ కేసును కొట్టివేసింది. వైసిపి ప్రభుత్వం కూడా ఆహ్వానించింది. ఇప్పుడు ఆ కేసు కొట్టివేతను సవాల్ చేస్తూఅపీల్ కు వెళ్లాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. కానీ ఆ మరుసటి రోజు ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. అయితే, తాజాగా ముద్రగడకు తీవ్ర అనారోగ్యం అంటూ కూతురు బయట పెట్టడంతో.. ప్రభుత్వం సైతం అందుకే వెనక్కి తగ్గి ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.




Updated On 9 Jun 2025 3:36 PM IST
Politent News Web4

Politent News Web4

Next Story