Ap Cm CBN : రైతులు, ప్రజల ఆకాంక్షల మేరకు ఎస్‌ఎల్‌బీసీ నిర్ణయాలు ఉండాలి
232వ రాష్ట్ర స్ధాయి బ్యాంకర్ల సమావేంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు

రైతులు, ప్రజలు, ప్రభుత్వ ఆకాంక్షలకు అనుగుణంగా ఎస్‌ఎల్‌బీసీ సమావేశాల్లో నిర్ణయాలు ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. వెలగపూడిలోని సచివాలయం 5వ బ్లాక్‌లో మంగళవారం 232వ రాష్ట్ర స్ధాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీయం చంద్రబాబు మాట్లాడుతూ ఆర్ధికశాస్త్రం చదివిన విద్యార్ధిగా, ప్రజాప్రతినిధిగా పేదల గురించి నేను ఆలోచన చేస్తున్నానని చంద్రబాబు చెప్పారు. బ్యాంకులు, పబ్లిక్ పాలసీలు ఎప్పుడూ ప్రజల్ని నియంత్రించకూడదని తదుపరి సంస్కరణల దిశగా ప్రోత్సహించాలని సూచించారు. అమెరికా, చైనా లాంటి దేశాలకు సవాలు విసిరేలా మన ఆర్ధిక వ్యవస్థ తయారు అవుతోందని అందుకు అనుగుణంగా బ్యాంకులు కొత్త ఆవిష్కరణల దిశగా ఆలోచనలు చేయాలన్నారు. మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా బ్యాంక్లు కూడా తమ తీరు మార్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఖరీఫ్ సీజన్‌లో ఇప్పటికే సగం సమయం గడిచిపోయిందని, ఈపాటికే రైతులకు రుణాలు, ఇన్‌పుట్ ఇవ్వాల్సి ఉందని సీయం గుర్తు చేశారు. సీజన్ ఆఖరులో ఇవ్వడం వల్ల రైతులకు ఎలాంటి ఉపయోగం ఉండదన్నారు. రొటీన్ సమావేశాల వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని, ఇండికేటర్లు కూడా రొటీన్‌గా మారుతున్నాయన్నారు. అయితే ఫాల్స్ లెండింగ్ చేయాలని ఎవరూ సిఫార్సు చేయరని, ఉత్పాదకత లేని రుణాలు కూడా మంచివి కావన్నారు. దేశంలో సంపద సృష్టి, ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా బ్యాంకులు, ఆర్ధిక సంస్థలు సమిష్టిగా పనిచేయాలని సీయం చంద్రబాబు సూచించారు. ఈ సమావేశంలో వ్యవసాయం, ప్రాథమిక రంగాలు, ఎంఎస్ఎంఈ, ఎస్‌హెచ్‌జీ రంగాలకు రుణ వితరణ లక్ష్యాలు, గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవలపై ముఖ్యమంత్రి సమీక్షించారు. అలాగే గత ఎస్‌ఎల్‌బీసీలో తీసుకున్న నిర్ణయాలపై యాక్షన్ టేకెన్ రిపోర్ట్‌పై సీయం సమీక్ష చేశారు. వన్ ఫ్యామిలీ, వన్ ఎంట్రపెన్యూర్ కార్యక్రమం, 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటు అంశంలో బ్యాంకుల సహకారంపై ఈ సమావేశంలో సీయం చంద్రబాబునాయుడు బ్యాంకర్లతో చర్చించారు. ఏపీ సచివాలయంలో జరిగిన 232వ ఎస్‌ఎల్‌బీసీ సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే.విజయానంద్, ఎస్‌ఎల్‌బీసీ చైర్మన్ నితీష్ రంజన్, కేంద్ర ఆర్ధిక విభాగం, ఆర్బీఐ, నాబార్డ్, సిడ్బీ, ఎగ్జిమ్ తదితర సంస్ధల ప్రతినిధులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
