YS Sharmila: సోషల్‌మీడియా రూమర్లు కట్టుకథలే.. కుమార్తె వివాహంతో రాజకీయాలు చేయను: వైఎస్ షర్మిల
వైఎస్ షర్మిల

YS Sharmila: తనపై సోషల్‌మీడియాలో వ్యాపిస్తున్న వార్తలన్నీ కట్టుకథలేనని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. కుమార్తె వివాహాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేసే ఖర్మ తనకు లేదని ఆమె సోషల్‌మీడియా పోస్ట్‌లో పేర్కొన్నారు.
‘‘నేను ఎవరినో కలిసినట్లు, ఎక్కడో చేరిపోతున్నట్లు నాపై సోషల్‌మీడియాలో అల్లుతున్నవన్నీ కట్టుకథలు. చేస్తున్న విశ్లేషణలు పూర్తిగా నిరాధారం. జరుగుతున్న ప్రచారం శుద్ధ అబద్ధం. నేనంటే గిట్టని వాళ్లు చేస్తున్నవి పసలేని ఆరోపణలు. వాటిని తీవ్రంగా ఖండిస్తున్నా’’ అని షర్మిల పేర్కొన్నారు.
వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్‌ను తాను చివరిసారిగా కలిసింది కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహానికి ఆహ్వానించిన సమయంలోనేనని గుర్తు చేశారు. ‘‘మళ్లీ ఇప్పుడు కలిసినా.. నా కుమార్తె వైఎస్ అంజలిరెడ్డి వివాహ ఆహ్వాన పత్రికను అందించడానికి మాత్రమే. అన్ని రాజకీయ పార్టీల అధినేతలను నా బిడ్డ పెళ్లికి రావాలని ఆహ్వానిస్తాను. ఇందులో కొత్తేం లేదు.. వింత అంతకన్నా కాదు’’ అని ఆమె అన్నారు.
కన్న కుమార్తె వివాహాన్ని అడ్డుపెట్టుకొని తెరవెనుక రాజకీయాలు చేసుకునే ఖర్మ తనకు లేదని షర్మిల స్పష్టం చేశారు. ‘‘శుభకార్యానికి, రాజకీయానికి లింకులు పెట్టి నా విశ్వసనీయతను, ప్రజలు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని దెబ్బతీయాలని చూస్తే ఊరుకునేది లేదు’’ అని హెచ్చరించారు.

