Deputy CM Pawan Kalyan: ఉప్పాడ మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి కమిటీ: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
సమస్యల పరిష్కారానికి కమిటీ: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

Deputy CM Pawan Kalyan: కాకినాడ జిల్లా ఉప్పాడలో మత్స్యకారులు చేపట్టిన ఆందోళనపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. రసాయన పరిశ్రమల వ్యర్థాల వల్ల తమ జీవనోపాధి ప్రభావితమవుతోందని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో, వారి సమస్యలు తన దృష్టికి వచ్చాయని పవన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.
‘‘మత్స్యకార కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యలను అర్థం చేసుకోగలను. శాసనసభ సమావేశాల కారణంగా ప్రస్తుతం వారిని నేరుగా కలిసి చర్చించలేకపోతున్నాను. అయినప్పటికీ, సోమవారం నుంచి జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులతో చర్చలు జరుపుతున్నాను. మత్స్యకారుల సమస్యలను పరిష్కరించేందుకు కాలుష్య నియంత్రణ మండలి, పరిశ్రమలు, ఫిషరీస్, రెవెన్యూ శాఖల అధికారులు, కాకినాడ జిల్లా కలెక్టర్‌తో కూడిన ఓ కమిటీని ఏర్పాటు చేస్తామని నిర్ణయించాము. ఈ కమిటీలో మత్స్యకార ప్రతినిధులు, స్థానిక నాయకులకు స్థానం కల్పిస్తాం. ఈ కమిటీ సమస్యల పరిష్కారంతోపాటు జీవనోపాధి మెరుగుదల, తీరప్రాంత గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన, నష్టపరిహారం మదింపుపై దృష్టి సారిస్తుంది. మత్స్యకారుల సమస్యలను అధ్యయనం చేసి, అమలు చేయదగిన సిఫారసులతో కూడిన నివేదికను ఈ కమిటీ సిద్ధం చేస్తుంది. ఆ నివేదిక ఆధారంగా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది’’ అని పవన్ పేర్కొన్నారు.
అత్యవసరంగా పరిష్కరించాల్సిన సమస్యలను ఇప్పటికే గుర్తించినట్లు ఆయన తెలిపారు. మరణించిన 18 మంది మత్స్యకారుల కుటుంబాలకు బీమా మొత్తం చెల్లింపు, ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ వద్ద దెబ్బతిన్న పడవలకు నష్టపరిహారం చెల్లించే అంశంపై అధికారులతో చర్చించి, తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించినట్లు పవన్ వెల్లడించారు. మచిలీపట్నం, అంతర్వేది వంటి ప్రాంతాల్లో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లేందుకు అవకాశం కల్పించాలని సూచించారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తుందని, ఉప్పాడ మత్స్యకారుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తామని ఆయన హామీ ఇచ్చారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే ఉప్పాడకు వెళ్లి మత్స్యకారులతో సమగ్రంగా చర్చిస్తానని పవన్ తెలిపారు.
రెండో రోజూ కొనసాగిన మత్స్యకారుల నిరసన
పిఠాపురం: ఉప్పాడలో మత్స్యకారులు తమ సమస్యల పరిష్కారం కోరుతూ చేపట్టిన నిరసనలు రెండో రోజూ కొనసాగాయి. ఉదయం 6 గంటల నుంచి కూడలి సమీపంలోని రహదారులను మూసివేసి ధర్నా చేశారు. కోనపాపపేట, మూలపేట, అమీనాబాద్ గ్రామాల్లో రహదారులను అడ్డుకున్నారు. దుకాణాలు తెరవవద్దని యజమానులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ షాన్‌మోహన్ మత్స్యకారుల వద్దకు వెళ్లి చర్చించి, వారి సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం తరఫున హామీ ఇచ్చారు.
