CM Chandrababu: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయం (ఏయూ) ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్స్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ విశాఖ నగరంలో సైక్లింగ్, వాకింగ్‌ల కోసం ప్రత్యేక మార్గాలు (ట్రాక్‌లు) ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.

వర్సిటీ అవసరమైన విద్యుత్తును 100 శాతం స్థానికంగా ఉత్పత్తి చేసుకోవాలని, చెట్లు లేని ఖాళీ స్థలాలు, భవనాల పైకప్పులపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఇప్పటికే రూ.5,18,000 విలువైన విద్యుత్ ఆదా అయిందని తెలిపారు. తిరుమల తరహాలో క్యాంపస్‌ను పచ్చదనంతో నింపాలని, ప్రపంచ వివిధ రకాల మొక్కలను తీసుకొచ్చి నాటాలని ఆదేశించారు.

పెరుగుతున్న ఎండలు, వాతావరణ మార్పులను ఎదుర్కోవాలని, హైదరాబాద్ తరహాలో పచ్చదనం అభివృద్ధి చేయాలని చెప్పారు. హాస్టళ్లు, కాలేజీల నుంచి వచ్చే తడి చెత్త, ఆకులను కంపోస్ట్‌గా మార్చి, వ్యర్థాల నుంచి బయోగ్యాస్ తయారు చేసి వంటలకు వాడాలని సూచించారు. రీసైక్లింగ్‌కు పనికొచ్చే వ్యర్థాలను వేరు చేసి, మిగిలిన చెత్త కోసం ‘వేస్ట్ టు ఎనర్జీ’ ప్లాంట్ ఏర్పాటు చేయాలని, మురుగు నీటి శుద్ధి ప్లాంట్లు నిర్మించాలని తెలిపారు. క్యాంపస్ నుంచి ఒక్క చుక్క నీరు కూడా బయటకు పోకుండా శుద్ధి చేసి చెట్లకు వాడాలన్నారు.

ప్రొఫెసర్లు, నిపుణులతో కమిటీ ఏర్పాటు చేసి ఇన్-హౌస్ నాలెడ్జ్ ఉపయోగించుకోవాలని, ప్రతి విద్యార్థి ఆలోచనలను యాక్షన్ ప్లాన్‌లో భాగం చేయాలని సీఎం సూచించారు. ప్రపంచంలోని టాప్ 10-20 యూనివర్సిటీల సరసన ఏయూను నిలపాలని లక్ష్యం ప్రకటించారు. క్యాంపస్ లోపల ఎలక్ట్రికల్ సైకిళ్లు అందుబాటులోకి తెచ్చి సైక్లింగ్‌ను ప్రోత్సహించాలని, ఇది కాలుష్యం తగ్గడంతోపాటు ఫిట్‌నెస్ పెంచుతుందని వివరించారు.

నెట్‌ జీరో కార్యక్రమంలో సైక్లింగ్:

ఈ సందర్భంగా నెట్‌ జీరో కార్యక్రమంలో భాగంగా ఏయూ నుంచి నోవాటెల్ హోటల్ వరకు 5.5 కిలోమీటర్ల దూరం సీఎం చంద్రబాబు సైకిల్‌పై ప్రయాణించారు. 21.18 నిమిషాల్లో గమ్యం చేరుకున్నారు. త్రీ టౌన్ పోలీస్ స్టేషన్, పోలమాంబ గుడి, వాల్తేరు, బీచ్ రోడ్ మీదుగా సాగిన ఈ సైక్లింగ్‌లో ఎండ తీవ్రత ఉన్నా ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు.

సీఎం వెంట కేంద్ర మంత్రి రామ్‌మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి డీబీవీ స్వామి, జిల్లా ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమం ద్వారా పర్యావరణ పరిరక్షణ, ఆరోగ్యవంతమైన జీవనశైలిని ప్రోత్సహించే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పం స్పష్టమైంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story