Minister Savitha: బీసీల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం – మంత్రి సవిత ప్రకటన
మంత్రి సవిత ప్రకటన

Minister Savitha: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో బీసీ రక్షణ చట్టాన్ని తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత తెలిపారు. ఈ చట్టం ద్వారా బీసీల మానసిక, సామాజిక రక్షణను బలోపేతం చేసి, వారి గౌరవాన్ని కాపాడాలనేది ప్రభుత్వ లక్ష్యమని ఆమె ఉద్ఘాటించారు.
విజయవాడలోని తాడిగడపలో ఉన్న బీసీ డైరెక్టరేట్ కార్యాలయంలో శుక్రవారం జరిగిన సమావేశంలో మంత్రులు సవిత, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర హాజరయ్యారు. బీసీ రక్షణ చట్టం విధివిధానాల రూపకల్పనపై విస్తృతంగా చర్చించారు. ఇప్పటికే చట్టం ముసాయిదా సిద్ధమైందని, దానిపై బీసీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ బీసీ సంఘాల ప్రతినిధుల అభిప్రాయాలు సేకరించాలని నిర్ణయించారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి సవిత మాట్లాడుతూ, "కులం, వృత్తి పేరుతో బీసీలను దూషించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. బీసీల మానప్రాణాలకు భరోసా కల్పించేలా ఈ చట్టం రూపొందించబడుతోంది. దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో ఇలాంటి చట్టాన్ని అమలు చేయబోతున్నాం. న్యాయనిపుణులతో చర్చించి, కోర్టుల్లో కూడా బలంగా నిలబడేలా రూపొందిస్తున్నాం. భేటీ వివరాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి, తుది ఆమోదం పొందాలని నిర్ణయించాం" అని వివరించారు.
బీసీలను అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలపడమే తమ లక్ష్యమని, ఈ చట్టం ద్వారా వారి హక్కులు, గౌరవం పూర్తిగా కాపాడబడతాయని మంత్రి సవిత విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ చర్యలు బీసీ సమాజంలో కొత్త ఉత్సాహాన్ని నింపుతాయని భావిస్తున్నారు.

