అరుదైన అవకాశంగా అమరావతి నిర్మాణం

Andhra Pradesh Economic Survey: కేంద్ర ఆర్థిక సర్వే (2025-26) ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నగర నిర్మాణాన్ని 'అరుదైన అవకాశం'గా పేర్కొంది. భవిష్యత్తులో సులభతర జీవనానికి అనువైన నగరంగా ఇది రూపొందుతుందని సర్వే స్పష్టం చేసింది.

ఒక నగరం ఇప్పటికే జనసాంద్రతతో కిక్కిరిసిపోయి, సేవల కొరత, అనధికార నిర్మాణాలు పెరిగిన తర్వాత మార్పులు చేయడం కంటే... గ్రీన్‌ఫీల్డ్ నగరంగా ముందు నుంచే ప్రణాళికాబద్ధంగా డిజైన్ చేసుకోవడం ద్వారా అద్భుతమైన జీవన వ్యవస్థను ఏర్పరచవచ్చని సర్వే వివరించింది. భారీ మౌలిక సౌకర్యాలపై మాత్రమే ఆధారపడే నగరాల కంటే, విద్య, ఇతర రంగాలతో అనుసంధానం చేసిన నగరాలే వేగంగా అభివృద్ధి చెందుతాయని తెలిపింది. అమరావతిని ఇలాంటి అభివృద్ధికి ఉదాహరణగా చూపింది.

దేశంలోని టాప్-10 జీవనయోగ్య నగరాల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన తిరుపతి, విజయవాడ స్థానాలు సాధించాయి. బెంగళూరు, దిల్లీ, ముంబయి వంటి నగరాల్లా తీవ్ర జనాభా ఒత్తిడి లేకుండా, మౌలిక సౌకర్యాలు, ఉద్యోగావకాశాలు సులభంగా అందుబాటులో ఉన్నాయని సర్వే పేర్కొంది.

అగ్రస్థానంలో ఉన్న నగరాలు: పుణె, నవీ ముంబయి, గ్రేటర్ ముంబయి, తిరుపతి, చండీగఢ్, ఠాణె, రాయ్‌పుర్, ఇండోర్, విజయవాడ, భోపాల్.

నిజమైన జీవనయోగ్య నగరాలు ధనికమైనవి కావని, కొత్తవి కావని సర్వే చెప్పింది. రోజువారీ జీవనంలో ఇబ్బందులను తగ్గించి, ప్రజల వ్యక్తీకరణకు, సృజనాత్మకతకు అవకాశం కల్పించేవే అసలైన నివాసయోగ్య నగరాలని వివరించింది. మౌలిక సౌకర్యాలతో పాటు ప్రజల సమయం, ఎంపికలు, సృజనాత్మకతను గౌరవించేలా ఉండాలని తెలిపింది.

ఉదాహరణలు:

డెట్రాయిట్‌లో భారీ మౌలిక సౌకర్యాలు, రహదారులు, పరిశ్రమలు, స్టేడియాలపై పెట్టుబడులు పెట్టినా ఆర్థిక ఉత్పాదకత పెరగలేదు. ఫలితంగా జనాభా తగ్గిపోయింది.

బోస్టన్‌లో మౌలిక సౌకర్యాలు పరిమితమే అయినా విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాలు ఎక్కువగా ఉండటంతో ఆర్థిక, విద్య, బయోటెక్ రంగాల్లో అభివృద్ధి సాధించింది.

బెంగళూరు మౌలిక సౌకర్యాలు తక్కువే అయినా ఇంజినీరింగ్ ప్రతిభ, స్టార్టప్ వాతావరణం కారణంగా భారతదేశ సిలికాన్ వ్యాలీగా ఎదిగింది.

జీవన సౌలభ్య సూచీలో విద్య, ఆరోగ్యం, హౌసింగ్, నీరు, పారిశుద్ధ్యం, వ్యర్థాల నిర్వహణ, రవాణా, భద్రత, వినోదం వంటి అంశాలను ప్రామాణికంగా పరిగణిస్తారని సర్వే తెలిపింది. ఈ ఆధారంగా నగరాల జీవన నాణ్యతను కొలుస్తారు.

అమరావతి నిర్మాణం ద్వారా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ నగరాలకు మార్గదర్శకంగా నిలవనుందని ఆర్థిక సర్వే సూచిస్తోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story