Lokesh: విద్యార్థుల మానసిక ఆరోగ్యం కోసం ప్రత్యేక మిషన్.. యోగా శిక్షణకు లోకేశ్ ఆదేశాలు
లోకేశ్ ఆదేశాలు

Lokesh: విద్యార్థుల్లో మానసిక ఒత్తిడిని నివారించేందుకు రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ అధికారులకు సూచించారు. ఉండవల్లి నివాసంలో పాఠశాల విద్య, ఉన్నత విద్య, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.
మానసిక ఆరోగ్య అవగాహన, ఇన్‌స్టిట్యూషనల్ సపోర్టు సిస్టం, మార్గదర్శకం కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని మిషన్ మోడ్‌లో ప్రారంభించాలని మంత్రి ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా తొలివిడతగా 935 ప్రభుత్వ పాఠశాలల్లో 4.47 లక్షల మంది విద్యార్థులకు యోగా శిక్షణ ఇప్పించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. పదవ తరగతి, ఇంటర్మీడియట్‌లో 90 శాతం ఫలితాలు సాధించాలని అధికారులను ఆదేశించారు. విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో విద్యార్థులు, అధ్యాపకుల హాజరు శాతం పెంచేందుకు ఎఫ్‌ఆర్‌ఎస్‌ను అమలు చేయాలని సూచించారు.
అక్షరాంధ్ర కార్యక్రమంలో వచ్చే ఏడాది చివరికి వంద శాతం అక్షరాస్యత సాధించాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశయమని, నిర్ణీత లక్ష్యాన్ని చిత్తశుద్ధితో సాధించాలని మంత్రి లోకేశ్ అన్నారు. మిషన్ మార్చ్ కార్యక్రమాన్ని సమర్థంగా అమలు చేస్తున్న ఉపాధ్యాయులు, అధికారులను ఆయన అభినందించారు.
ఈ సందర్భంగా సమగ్ర శిక్షా ఎస్‌పీడీ బి.శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థుల మానసిక ఆరోగ్య సంరక్షణ కోసం కేర్ ఏపీ టూల్‌ను సిద్ధం చేశామని, ప్రయోగాత్మకం కూడా పూర్తయిందని తెలిపారు. హైదరాబాద్‌లోని కన్హా శాంతి వనం సంస్థ ద్వారా యోగాపై రెండు వేల మంది ఔత్సాహిక ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వబోతున్నామని వివరించారు. కుప్పంలోని అగస్త్య సైన్స్ ఫౌండేషన్‌లో ఉపాధ్యాయులకు సైన్స్ శిక్షణ కొనసాగుతోందని చెప్పారు.
నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ డైరెక్టర్ గణేష్ కుమార్ మాట్లాడుతూ ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 5.43 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించామని తెలిపారు.

